గణేశ్ నిమజ్జనం కోసం హైదరాబాద్ వచ్చిన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సభలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాలు చూస్తే తెలంగాణలో ఎంత అరాచక వ్యవస్థ నడుస్తోందో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని ఫైర్ అయ్యారు విజయశాంతి. తెలంగాణకు వచ్చిన మరో రాష్ట్ర సీఎంని ప్రభుత్వ అతిథిగా, వీవీఐపీగా గౌరవించాల్సింది పోయి కనీస భద్రత కూడా కల్పించలేని దుస్థితిలో కేసీఆర్ సర్కారు ఉందన్నారు.
హిమంతగారు పాల్గొన్న సభలో వేదిక మీదికి ఒక టీఆరెస్ కార్యకర్త వచ్చి మైక్ విరగ్గొట్టడం, అతన్ని ఆపడానికి అక్కడి పోలీసులు ముందుకు రాకపోవడం చూస్తుంటే ఇదంతా ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిన సంఘటనేనని స్పష్ఠమవుతోంది. భద్రతా వైఫల్యం, నిఘావైఫల్యం కొట్టొట్టినట్టు కనిపించాయి. బీజేపీ నాయకులు రాష్ట్రంలో నోరు విప్పినా, చిన్నపాటి విమర్శ చేసినా తట్టుకోలేక ఇప్పటికే నిర్బంధాలు, అరెస్టుల పర్వం సాగుతోందని మండిపడ్డారు.
హిమంతగారికి ఎదురైన అనుభవాన్ని బట్టి కాషాయదళం అంటే టీఆరెస్ సర్కారు ఏ స్థాయిలో వణికిపోతోందో తెలుస్తూనే ఉంది. హైదరాబాద్ వచ్చిన మరొక రాష్ట్ర సీఎంని అవమానించి, కేసీఆర్ సర్కారు తెలంగాణకి జాతీయస్థాయిలో తలవంపులు తీసుకొచ్చింది. జరిగినదానికి సిగ్గుతో తలవంచుకోవాల్సిందిపోయి రాష్ట్ర మంత్రులు బీజేపీ పైనే ప్రతివిమర్శలు చెయ్యడం చూస్తే ప్రభుత్వ యంత్రాంగం ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చన్నారు విజయశాంతి.