బీజేపీలో ముసలం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పార్టీ నేతలపై విజయశాంతి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కేసీఆర్ ను విమర్శించే విజయశాంతి…బీజేపీ దాడులపై స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలనేవి పరిపాలనాపరంగా సామాజిక ప్రయోజనం కోసం ఉద్దేశించిన యజ్ఞాల వంటివి. ఎన్నికల్లో పోటీ చేసే తోటి పార్టీలను, వారి అభ్యర్థులను ప్రత్యర్థులుగా మాత్రమే భావించాలి తప్ప శత్రువులుగా భావించి దాడులకు పాల్పడటం ఎంతమాత్రం సరి కాదు. ఎన్నికలప్పుడు పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్ధి గెలుపు కోసం పగలు,రాత్రి శ్రమిస్తుంటారని పేర్కొన్నారు రాములమ్మ.
విజయం కోసం విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అది అంతవరకే పరిమితం కావాలి. తెలంగాణ విషయానికే వస్తే, మునుగోడు ఉపఎన్నికలో పోటీ పడుతున్న రాజకీయ పార్టీలు, నేతలు, కార్యకర్తలు అందరం దశాబ్దాల కాలంపాటు కొనసాగిన అన్యాయంపై సోదరభావంతో ఐక్యంగా కొట్లాడి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నం. కానీ, నేటి ఉపఎన్నిక విషయం వచ్చేసరికి ఆ ఐక్యత స్ఫూర్తి కొరవడి దాడి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. మనమంతా ముందు తెలంగాణ బిడ్డలం… తర్వాతే ఎన్నికల్లో ప్రత్యర్థులమన్న మాట మర్చిపోకూడదు. తెలంగాణ సాధనలో కనబరచిన ఐక్యతా స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటున్నానని వెల్లడించారు విజయ శాంతి. అయితే.. విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ ఉద్దేశించి చేసినవని అర్థమౌవుతోంది.