టీఆర్‌ఎస్ సర్కార్కు ప్రజాబలంతోపాటు దైవ బలం కూడా తోడైందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తమకు మునుగోడులో గతంలో కంటే 25 వేల ఓట్లు అధికంగా వచ్చాయని తెలిపారు. ఉపఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని వినోద్ కుమార్ తెలిపారు. రాజన్న ఆలయ విస్తరణకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతోందని వెల్లడించారు.
మునుగోడులో కాంగ్రెస్ తన సాంప్రదాయ ఓట్లను కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు. ఇతర దేశాల్లో పార్టీకి పడే ఓట్ల ఆధారంగా అభ్యర్థులు ఎన్నికవుతారని చెప్పారు. భారత్‌లో కూడా అలాంటి విధానమే రావాలని, దేశవ్యాప్తంగా ఎన్నికల విధానంపై చర్చజరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 32 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ తరపున ప్రధాని మోదీ దేశాన్ని పాలిస్తున్నారని, కానీ కాషాయపార్టీని 62 శాతం ఓటర్లు తిరస్కరించారని చెప్పారు. రాబోయే తరంలో ఎన్నికల విధానంలో సమూల మార్పులు జరగాల్సిన అవసరం ఉందన్నారు.