నేడు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లు లెక్కింపు చేయనున్నారు. 94 టేబుళ్లపై లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపులో 2,100 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కౌటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు.
శాసనసభ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల స్థానం ఖాళీ అయింది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ ఎన్నికల బరిలో నిలవగా, వీరితోపాటు మరో 49 మంది పోటీలో నిలిచారు. ఈ ఉపఎన్నికలో 72.44 శాతం పోలింగ్ నమోదైంది.