యాద‌గిరి గుట్ట‌కు ఏమ‌యింది స‌ర్ ?

-

దేశాన్ని ప్రేమించే పాల‌కులు కొంద‌రు. దేశాన్ని ధ‌ర్మాన్ని కాపాడుతాం అని చెప్పిన పాల‌కులు కొంద‌రు. ధ‌ర్మాన్ని కాపాడే క్ర‌మంలో హిందూ ఆల‌యాల‌ను కాప‌డ‌తాం అని చెప్పిన వారు కొంద‌రు. అంతా ఒక్క‌టే కాదు వేర్వేరు. అంద‌రూ ఒక్క‌టే కాదు వేర్వేరు. పార్టీలు కూడా వేర్వేరు. ధ‌ర్మ సంస్థాప‌న‌లో భాగంగా నార‌సింహ అవ‌తారంలో యాద‌గిరిగుట్ట‌లో వేంచేసిన దేవుడు ఎందుక‌ని ఇన్ని త‌ప్పుల‌ను ఉపేక్షిస్తున్నాడో క‌దూ ! మ‌నుషుల త‌ప్పులను భ‌రించే శ‌క్తి దేవుడికి మాత్ర‌మే ఉంటుంద‌ని అంటారే ! అదే నిజం కావొచ్చు . ఆ విధంగా పాల‌కుల త‌ప్పిదాలు వెలుగులోకి రావొచ్చు కూడా !

పాల‌కులు ఏం చేసినా ప‌ట్టించుకోకండి ఎందుకంటే అది వాళ్ల హ‌క్కు. పాల‌కులు ఎంత నిర్ల‌క్ష్యంగా ఉన్నా కూడా ప‌ట్టించుకోకండి ఎందుకంటే అది వాళ్ల హ‌క్కు.. రాజుల సొమ్ము రాళ్ల పాలు ఆ రోజు. ఈ రోజు కూడా అదే రుజువు అయింది. రాజుల సొమ్ము రాళ్ల పాల‌యినా కూడా ఫ‌లితం లేదు. ఆ రోజు నిర్మాణాలు చెక్కు చెద‌ర లేదు కానీ ఇవి మాత్రం అందుకు భిన్నంగానే ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారు కేసీఆర్. కోపం కాకుండ్రి ఆగ‌మాగం చేయ‌కుండ్రి ప్లీజు.

కేసీఆర్ క‌న్న క‌ల‌లు ఏమ‌య్యాయో తెలియ‌దు. కేసీఆర్ తో పాటు ఇంకొంద‌రి క‌ల‌లు ఏమ‌య్యాయో కూడా తెలియ‌దు. ఆఖ‌రికి ఆల‌యం నిర్వాహ‌ణ సంబంధ లోపాల‌తో వెలుగులోకి రావ‌డం దుర‌దృష్టానికి సంకేతం. అయినా వెయ్యి కోట్ల ఆల‌యంలో ఇన్ని అస్త‌వ్య‌స్త‌త‌లు ఉంటాయి అని ఎవ్వ‌రైనా ఊహించారా? ఇప్పుడేం అంటారు.. పార్కింగ్ ఫీజు త‌గ్గిస్తారా లేదా మ‌ళ్లీ నిర్మాణాలు అంటూ పార్కింగ్ ఫీజులు పెంచుతారా? ఎంత అన్యాయం కదూ ! కొద్ది పాటి వాన‌కే ఆల‌య ప్రాంగ‌ణం జ‌ల‌మ‌యం కావ‌డం ఎంత అన్యాయం కదూ!

వెయ్యి కోట్ల ఆల‌యాన్ని ప‌ట్టించుకోండి. వెయ్యికోట్ల ఆల‌యంలో జ‌రిగిన అక్ర‌మాల‌నూ ప‌ట్టించుకోండి. ఆల‌యం అంటే ఆనందాల‌కు సంకేత ధామం కానీ ఇక్క‌డ ఆల‌యం మాత్రం నిర్ల‌క్ష్యాన్ని ప్ర‌తిబింబించే సంకేత స్థావ‌రం. ఆ విధంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన యాద‌గిరి గుట్ట నార‌సింహ క్షేత్రం కొద్ది పాటి వాన‌ల‌కే బీట‌లు వారింది. రోడ్లు రెండుగా చీలి పోయాయి. దీంతో వెయ్యి కోట్ల ఆల‌యం నిర్మాణంపై ఇప్పుడు ప‌లు అనుమానాలు రేగుతున్నాయి. ఇక ఈ ఆల‌యం నిర్వ‌హ‌ణ ఎలా ఉన్నా కూడా మ‌రో సారి నిర్మాణ సంబంధ లోపాలు స‌రిచేయ‌కుండా ఉంటే మ‌రికొద్ది వాన‌ల‌కు డొల్ల‌త‌నం అంతా బ‌య‌ట‌ప‌డే ప్ర‌మాదం ఉంది. వానలు వ‌చ్చినా, విల‌యాలు వ‌చ్చినా చెక్కు చెద‌ర‌ని రీతిలో నిర్మాణాలు సాగించాం అని ఆ రోజు చెప్పుకునేందుకు ఉండ‌దు. అప్పుడు ఆల‌యం అభివృద్ధి అన్న‌ది కేవ‌లం రియ‌ల్ట‌ర్ల కోస‌మే అన్న బీజేపీ వాద‌న లేదా అభియోగం నిజం అయ్యే ప్ర‌మాదం కూడా లేక‌పోలేదు.

Read more RELATED
Recommended to you

Latest news