ఖమ్మంలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత – కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

-

ఖమ్మం: కాంగ్రెస్ సభపై ఆంక్షలు తగదన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్​ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న జనగర్జన సభకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం సమంజసం కాదన్నారు. రాహుల్​ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటి? అని ప్రశ్నించారు. 4 నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కి చెప్పేది ఒక్కటే.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు పోరాటాలు, సభలు, ధర్నాలు చేసుకునే హక్కు ఉందన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారని.. అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ వాహనాలకు డబ్బులు కడతామన్నా ఇవ్వలేదని.. సరే అని ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఏ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా ఆర్టీసీ బస్సులు వాడుకోవడం జరుగుతూ ఉంటుందని.. కాంగ్రెస్ సభకు భయపడి ప్రభుత్వం బస్సులను ఇవ్వలేదన్నారు.

పైగా కక్ష కట్టి ప్రైవేట్ వాహనాలను ఆపి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పోలీసులు న్యాయంగా డ్యూటీ చేయాలని.. సభా ప్రాంగణానికి 15, 20 కిలోమీటర్ల దూరంలో ఆపేయడం కరెక్ట్ కాదన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు కోమటిరెడ్డి.

కేసీఆర్ వెంటనే సభను సజావుగా సాగేందుకు పోలీసులకు సూచనలు చేయాలన్నారు. లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడ వాహనాలు ఆపితే అక్కడికి వేలాదిగా బైకులపై వెళ్తామని.. జనగర్జన జరిపి తీరుతాం.. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news