ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రూ.60కోట్లు ఖర్చు పెట్టి గెలిచిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ జగ్గారెడ్డి ఆరోపించారు. నా దగ్గర కూడా అంత డబ్బు ఉంటే బీఆర్ఎస్ నేతలకు నేను చుక్కలు చూపించేవాడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తన దగ్గర డబ్బులుంటే మెదక్ జిల్లాలో అసలు బీఆర్ఎస్ నాయకులు గెలిచేవారు కాదన్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని కొందరూ నేతలను బీఆర్ఎస్ టార్గెట్ చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు బ్లాక్ మనీ ఎక్కడ దాచాడో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డికి చెబుతానని తెలిపారు జగ్గారెడ్డి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ రెడ్డి చేతిలో జగ్గారెడ్డి ఓటమి పాలైన విషయం తెలిసిందే. మరోవైపు ఈసారి జగ్గారెడ్డి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.