నాకు పెళ్లొద్దు చదువుకుంటా.. తల్లిదండ్రులపై యువతి ఫిర్యాదు

-

హైదరాబాద్ లో ఓ యువతి తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని మానవ హక్కుల కమిషన్(హ్యూమన్ రైట్స్ కమిషన్) ను ఆశ్రయించింది. తనకు పెళ్లి వద్దని, చదువుకుంటానని ప్రాధేయపడింది. హైదరాబాద్ శివారు కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం వాసి 19 ఏళ్ల యువతి స్థానిక కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.

తనకు గత నెల 31వ తేదీన తల్లిదండ్రులు బలవంతంగా నిశ్చితార్థం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా, చదువుకుంటానని చెప్పినా పట్టించుకోకుండా ఈ నెల 20వ తేదీన పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సిద్ధం అవుతున్నారని పేర్కొంది. తనకు పెళ్లి చేయకుండా పేరెంట్స్ కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది.

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చిన యువతి, ఓ లాయర్ సాయంతో మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించింది. తనకు పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, వివాహానికి మానసికంగా సన్నద్ధంగా లేనని ఫిర్యాదులో చెప్పింది. తనకు చదువు అంటే ఎనలేని ఇష్టం అని ఉన్నత చదువులు అభ్యసించాలని ఉందని పేర్కొంది. తన పెళ్లిని ఆపు చేయించాలని, ఆ మేరకు తల్లిదండ్రులకు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదు చేసింది.

అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్… తల్లిదండ్రులను పిలిచింది. ఇవాళ జరిగే విచారణకు యువతి, యువతి తల్లిదండ్రులు రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం జరగనున్న విచారణలో మానవ హక్కుల కమిషన్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుందో అని చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు మరికొందరికి ఆదర్శం కావాలని.. ఇష్టం లేని పెళ్లి చేయాలనే తల్లిదండ్రులు మార్పలు రావాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news