TSPSC కేసులో అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. సర్వర్లు హ్యాకింగ్.. క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్.. హైటెక్ మాస్ కాపీయింగ్.. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన TSPSC బోర్డు నిర్వాకమిదని.. ఎగ్జామ్ హాల్ లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బడ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల వద్ద కేసీఆర్ పోలీసులు ఏం చేస్తున్నట్టు? అని ఆగ్రహించారు.
24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమైందా? అని నిలదీశారు షర్మిల. లక్షలాది మంది యువత అప్పులు చేసి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే.. వాళ్లకు ఇచ్చిన బహుమానం ఇదేనా? చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే.. కేసీఆర్, TSPSC బోర్డు సిగ్గుతో తలదించుకోవాలి కదా ? అని చురకలు అంటించారు షర్మిల. TSPSC ఐటీ డిపార్ట్ మెంట్ మొత్తం అవినీతిపాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి కదా ? అని రెచ్చిపోయారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా గవర్నర్ తమిళసై స్పందించి, మీకున్న అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతికి సిఫారసు చేసి, TSPSC బోర్డును పునరుద్ధరించాలని మనవి అంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.