దేశంలోని టెలికాం వినియోగదారులందరూ ప్రస్తుతం OTPల సమస్యను ఎదుర్కొంటున్నారు. చాలా మందికి ఓటీపీలు విపరీతమైన ఆలస్యంతో వస్తున్నాయి. ఇక కొందరికైతే అసలు ఓటీపీలే రావడం లేదు. అందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త ఎస్ఎంఎస్ టెంప్లేట్ కారణమని నిర్దారించారు.
ట్రాయ్ నిజానికి కొత్త ఎస్ఎంఎస్ టెంప్లేట్ ను అమలు చేయాలని టెలికాం కంపెనీలకు ఎప్పటి నుంచో సూచిస్తోంది. అయినప్పటికీ కంపెనీలు ట్రాయ్ మాటలను పట్టించుకోలేదు. అయితే ట్రాయ్ చివరకు కంపెనీలను హెచ్చరించడంతో చివరకు కొత్త ఎస్ఎంఎస్ టెంప్లేట్ ను ప్రవేశపెట్టక తప్పలేదు. ఈ క్రమంలో ఆ టెంప్లేట్ మార్చి 8వ తేదీన అర్థరాత్రి నుంచి లైవ్ అయింది. అయితే ఆ తరువాత నుంచే వినియోగదారులకు ఓటీపీల సమస్యలు వస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలో అధిక శాతం మంది మొబైల్ వినియోగదారులకు ఓటీపీలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. దీంతో వారు పలు లావాదేవీలను నిర్వర్తించలేకపోతున్నారు. అలాగే కొందరికి ఓటీపీలు అసలు రావడం లేదు. ఇది ఎస్ఎంఎస్‌లు, ఓటీపీల ఫ్రాడ్‌కు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను టెలికాం కంపెనీలు త్వరగా పరిష్కరించకపోతే వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరిస్తున్నారు.