ఐపిఎల్ కి వంటలక్క సెగ.. టైమింగ్ మార్చండి..!

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లకు ప్లాన్ చేస్తుండగా.. గత సీజన్లలో పోలిస్తే అరగంట ముందే ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 4 గంటలకి బదులుగా 3.30కు, రాత్రి 8 గంటలకు బదులుగా 7.30కి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఐపిఎల్ టైమింగ్స్ మార్చాలంటూ ఓ తెలుగు అభిమాని సౌరవ్ గంగూలీకి ట్వీట్ చేసారు.

శివచరణ్ అనే వ్యక్తి ‘సౌరవ్ గంగూలీ సర్ ఐపిఎల్ టైమింగ్స్ రాత్రి 7.30 నుంచి 8.00 గంటలకు మార్చండి. ఎందుకంటే 7.30 స‌మ‌యానికి మా ఇంట్లో ‘కార్తీక దీపం’ సీరియల్ చూస్తారు. అస‌లే మా ఇంట్లో ఒకే టీవీ ఉంది. దయచేసి టైమింగ్స్ మార్చి మా ఇంట్లో గొడవలు జరగకుండా చూడండి’ అని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ఇక శివ చరణ్ విన్నపంపై స్పందించిన స్టార్‌మా.. ఇది చాలా నిజాయితీతో కూడి రిక్వెస్ట్ అంటూ కామెంట్ చేసింది. దీనిపై కూడా స్పందించిన శివచరణ్.. ‘స్టార్ మా మీరైనా స్టార్ ఇండియాకు చెప్పండి. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 8గంటలకు ప్రారంభించాలి’అని కోరాడు.