సినీ కార్మికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వేతనాలు పెంచాలంటూ మూడేళ్లుగా సినీ కార్మికులు పోరాడుతున్నారు. ఎట్టకేలకు వారి డిమాండ్లకు అంగీకరించిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి వేతనాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కార్మికులు కోరుతున్నట్లు 30 శాతం వేతనాలను పెంచేందుకు నిర్మాతల మండలి అంగీకరించింది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో నిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో కార్మికులు గతంలో చిత్రీకరణలను నిలిపివేసి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.
ప్రతి మూడేళ్లకోసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిల్మ్ ఫెడరేషన్ మరోసారి పట్టుపట్టింది. తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఈనెల 16 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించింది.
దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారీగా పెంచాలని నిర్ణయించింది. ఈ విషయంపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు భావిస్తున్నారు.