అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజే.. రాఖీ పౌర్ణమి.. ఆ రోజున అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీలను కట్టి తమకు రక్షగా ఉండమని కోరుకుంటారు.
అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకునే రోజే.. రాఖీ పౌర్ణమి.. ఆ రోజున అక్కలు, చెల్లెల్లు తమ సోదరులకు రాఖీలను కట్టి తమకు రక్షగా ఉండమని కోరుకుంటారు. ఇక కొన్ని చోట్ల భార్యలు భర్తలకు కూడా రాఖీలు కట్టి తమకు రక్షణగా నిలవాలని, తమతో జీవితాంతం కలిసి ఉండాలని ఆకాంక్షిస్తుంటారు. దేశంలోని అనేక మతాలకు చెందిన వారు జరుపుకునే పండుగల్లో రాఖీ పండుగ కూడా ఒకటి. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ పండుగను జరుపుకుంటారు.
అయితే నిజ జీవితంలోనే కాదు, సినిమాల్లోనూ సోదరి, సోదరుల సెంటిమెంట్‌తో అనేక సినిమాలు వచ్చాయి. అవన్నీ సూపర్ హిట్ మూవీలుగా నిలిచాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సినిమాలను పరిశీలిస్తే…
1. రక్త సంబంధం
దివంగత నటుడు ఎన్టీఆర్, నటి సావిత్రిలు అన్నా చెల్లెలుగా 1962వ సంవత్సరంలో వచ్చిన రక్త సంబంధం సినిమా అప్పట్లో సూపర్‌హిట్ అయింది. అందులో ఎన్టీఆర్, సావిత్రిలు అద్భుతంగా నటించి అందరితో కంట తడి పెట్టించారు. సోదరి, సోదరుల మద్య ఉండే బంధాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. నేటి తరం అక్కా తమ్ముళ్లకు, అన్నా చెల్లెళ్లకు ఈ మూవీ ఆదర్శంగా నిలుస్తుంది.
2. చెల్లెలి కాపురం
1971లో వచ్చిన చెల్లెలి కాపురం సినిమా కూడా ఆ సెంటిమెంట్‌ను మనకు బలంగా చూపిస్తుంది. అందులో శోభన్ బాబు తన చెల్లెలి కోసం తన కెరీర్‌ను కూడా త్యాగం చేస్తాడు. అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన సినిమాల్లో ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
3. ముద్దుల మావయ్య
నందమూరి బాలకృష్ణ హీరోగా 1989లో వచ్చిన ఈ మూవీలోనూ అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ను బాగా చూపించారు. చెల్లెలి కాపురం కోసం ఓ అన్న పడే ఆరాటం ఇందులో మనకు కనిపిస్తుంది.
4. చంటి
ప్రముఖ నటుడు వెంకటేష్ హీరోగా 1992లో వచ్చిన చంటి సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. చెల్లెలు అంటే ప్రాణం ఇచ్చే ముగ్గురు అన్నలు ఎంత కోసమైనా తెగిస్తారనేది ఇందులో చూపించారు.
5. పల్నాటి పౌరుషం
1994లో వచ్చిన ఈ మూవీలో రెబల్ స్టార్ కృష్ణం రాజు అద్భుతంగా నటించినందుకుగాను ఆయనకు అప్పట్లో ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఇందులో తన చెల్లెలి కోసం పడే తపనను చక్కగా చూపించారు.
6. హిట్లర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 1997లో వచ్చిన హిట్లర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. తన ఐదుగురు చెల్లెళ్ల కోసం ఏం చేయడానికైనా వెనుకాడని పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి సెంటిమెంట్‌ను పండించారు.
7. శివరామరాజు
2002లో వచ్చిన ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్‌ను బాగా చూపించారు. చెల్లెలి కోసం లక్షల ఆస్తిని వదులుకుని అన్నలు పేదలుగా బతుకుతారు. చెల్లెలికి వచ్చే ఆపదలను తప్పిస్తారు. ఈ మూవీ కూడా అప్పట్లో హిట్ అయింది.
8. పుట్టింటికి రా చెల్లీ
ప్రముఖ నటుడు అర్జున్ ప్రధాన పాత్రలో 2003లో వచ్చిన ఈ మూవీలో చెల్లెలి సెంటిమెంట్‌ను బాగా వర్కవుట్ చేశారు. చెల్లెలి కోసం ఓ అన్న పడే తపనను ఇందులో చూపించారు.
9. అర్జున్
ప్రముఖ నటుడు మహేష్ బాబు, నటి కీర్తిరెడ్డిలు ఇందులో అన్నాచెల్లెళ్లుగా నటించారు. అప్పట్లో ఈ మూవీ యావరేజ్‌గా నడిచింది. అయినప్పటికీ సిస్టర్ సెంటిమెంట్‌ను ఇందులో అమోఘంగా చూపించారు.
10. అన్నవరం
సిస్టర్ సెంటిమెంట్‌పై వచ్చిన మూవీల్లో అన్నవరం కూడా ఒకటి. చెల్లెలి కోసం ఓ నగరంలో ఉన్న రౌడీలను మట్టుబట్టే పాత్రలో పవన్ కల్యాణ్ అద్భుతంగా నటించి మెప్పించారు.
11. రాఖీ
చెల్లెలి చావుకు ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా.. సమాజంలో వేధింపులను ఎదుర్కొంటున్న అనేక మంది యువతులు, మహిళలకు రక్షణగా నిలిచే రాఖీ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు. అప్పట్లో ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సిస్టర్ సెంటిమెంట్‌ను ఇందులో చాలా బలంగా చూపించారు.
12. గోరింటాకు
అన్నా చెల్లెళ్లుగా పుట్టిన తమను చావులో కూడా ఎవరూ విడదీయలేరని చాటి చెప్పిన సినిమా ఇది. ఇందులో నటుడు రాజశేఖర్, నటి మీరా జాస్మిన్లు అన్నాచెల్లుళ్లుగా అద్భుతంగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేకపోయినా.. సిస్టర్ సెంటిమెంట్‌ను ఇందులో బాగానే చూపించారు.
సిస్టర్ సెంటిమెంట్‌తో తెలుగులో వచ్చిన పలు సినిమాల్లో ఇవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ సోదరులు తమ సోదరీమణులకు అన్ని విధాలుగా రక్షణగా ఉండాలని ఆశిద్దాం..!