కరోనా మహమ్మారి పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు ఎన్ని కష్టాలను తెచ్చి పెట్టిందో అందరికీ తెలిసిందే. ఎన్నో కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. ఒక పూట తిండికి కూడా చాలా మంది నోచుకోవడం లేదు. కుటుంబాలు గడవడమే కష్టమైపోతుంది. ఇలాంటి విపత్కర సమయంలో అన్ని రంగాలపై నెమ్మదిగా కరోనా ప్రభావం మరింత ఎక్కువగా పడుతోంది. ఇక ఆర్‌టీసీలోనూ ప్రస్తుతం కోతలు మొదలయ్యాయి.
ఏపీఎస్ ఆర్టీసీ తాజాగా.. ఏకంగా.. ఒకేసారి 6వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసకుంది. విధులకు వారు రావొద్దంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు తెలంగాణలో ఆర్‌టీసీ సేవలను ప్రారంభిస్తారని తెలుస్తుండగా.. ఆ సంస్థలోనూ కేవలం శాశ్వత ఉద్యోగులతోనే పనిచేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అదే జరిగితే టీఎస్ఆర్టీసీలోనూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కష్టకాలం వచ్చిందనే చెప్పాలి.
కరోనా లాక్‌డౌన్‌తో బస్సు సర్వీసులు నడవక సంస్థలు ఉద్యోగులకు జీతాలిచ్చే స్థితిలో లేవు. దీని వల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏపీఎస్ఆర్‌టీసీ తొలగించింది. అయితే తెలంగాణలోనూ ఆ పరిస్థితి ఉంటుందా.. అనేది త్వరలో తేలనుంది. ఏది ఏమైనా.. ఇప్పుడు ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మికులకు చాలా గడ్డు పరిస్థితి నెలకొందనే చెప్పాలి. వారి భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి..!