టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్న నేపథ్యంలో విజయవాడ సిటీ కోర్టు కాంప్లెక్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై భగ్గుమన్న టీడీపీ మహిళా కార్యకర్తలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు కోర్టు వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. కోర్టు వైపు రహదారుల్లో వెళ్లే వారిని తనిఖీ చేయడంతో పాటు ఆ పరిసరాల్లో వెళ్లే వారిని తనిఖీ చేయడంతో పాటు ఆ పరిసరాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వైద్య పరీక్షల అనంతరం చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరు పరుచనున్నారు.
అక్రమ అరెస్ట్ కి నిరసనగా చంద్రబాబుకి మద్దతు తెలిపేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు విజయవాడకు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్ రాజోలు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.