ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి పదో తరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచీ ఏప్రిల్ 17 వరకూ జరగాల్సి ఉంది. వాటిని రెండు వారాల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
రెండు వారాల తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోతే ఆ గడువుని పొడిగించే అవకాశాలు కనపడుతున్నాయి. పరీక్షలు ఎప్పుడు జరిపేదీ త్వరలో తేదీలు ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో ఏడు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే కఠిన చర్యలను తీసుకుంటుంది జగన్ సర్కార్. అలాగే పలు పరీక్షలను కూడా వాయిదా వేసింది.
ఇక తెలంగాణాలో కరోనా కేసులు 36 నమోదు అయ్యాయి. ఇవాళ ఒక్క రోజు మూడు కేసులు నమోదు అయ్యాయి. రెండు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు. బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటకు వస్తుంటే చాలు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. కరోనా కేసులను అదుపు చేయడానికి గానూ రెండు రాష్ట్రాల సరిహద్దులను ప్రభుత్వాలు మూసి వేసిన సంగతి తెలిసి౦దే.