కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే.. కర్కశుడిగా మారాడు. నిత్యం కన్న కూతిరినే వేధింపులకు గురి చేశారు. దీంతో వేధింపులు భరించలేక ఆ విద్యార్థిని తనువు చాలించింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. “మా నాన్న మూర్ఖుడు.. తాగొచ్చి రోజూ నరకం చూపిస్తున్నాడు. అమ్మ బతికి ఉన్నప్పుడు మంచిగా ఉండేవాడు.. ఆపై మద్యానికి బానిసై మృగంగా మారాడు. నాన్నా.. అని పిలవడానికీ మనసు రావడంలేదు. ఆయనను చంపాలని లేదా చనిపోవాలని ఉంది. మూడుసార్లు ఉరివేసుకున్నా ఎవరో ఒకరు కాపాడారు. ఆయన రోజూ వేధిస్తున్నాడు. ఇంకొన్ని రోజుల్లో నా చావు వార్త అందరికీ తెలుస్తుంది. వెయిటింగ్ ఫర్ మై డెత్’.. అంటూ ఓ విద్యార్థిని గతంలోనే ఉత్తరం రాసుకుంది. పదో తరగతి పరీక్షలకు ముందురోజు ఉరివేసుకుని తనువు చాలించింది.
ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం బుగ్గోనిగూడలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ రామయ్య, బాలిక సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింహులు, లలిత దంపతులకు కుమారుడు, పదోతరగతి చదువుతున్న కుమార్తె మనీషా(16) ఉన్నారు. లలిత ఏడాది క్రితం చనిపోయింది. భార్య చనిపోయినప్పటి నుంచి నర్సింహులు తాగుడుకు బానిసయ్యాడు. ఆ మైకంలో కుమారుడు, కుమార్తెతో నిత్యం గొడవపడేవాడు. ఆదివారం ఉదయమూ అదే జరిగింది. మధ్యాహ్నం తండ్రి కుమారుడికి ఫోన్చేసి చెల్లెలు ఇంట్లో దూలానికి ఉరివేసుకుందని చెప్పాడు. ఆయన ఇంటికి వచ్చి చూడగా మెడ భాగంలో కమిలిన గాయాలతో మనీషా చనిపోయి ఉంది. పక్కనే మంచంపై ఉన్న పుస్తకంలో ‘ఐ హేట్ మై డ్యాడ్ అని నాలుగుసార్లు రాసి ఉంది. ‘మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం’.. అంటూ గతంలో రాసిన లేఖ కూడా దొరికింది. ఈ మేరకు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.