కశ్మీర్ లోయలో గత కొద్ది రోజులుగా ఇండియన్ ఆర్మీ యాంటీ టెర్రరిజం ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇటీవల ఉగ్రవాదుల్లో చేరిన వారి జాబితాను సిద్ధం చేసింది. అయితే అందులో ఉన్న వ్యక్తిని మళ్ళీ వెనక్కు తెచ్చారు. వివరాల్లోకి వెళ్తే బుద్గాం జిల్లా చాదూరాకు చెందిన జహంగీర్ భట్ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇటీవలే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు.
ఇంతలోనే ఆర్మీ యాంటీ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టింది. ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా జహంగీర్ ఎదురుపడ్డాడు. తాను లొంగిపోతానంటూ చేతులు పైకెత్తి సైన్యం వద్దకు వచ్చాడు. అతన్ని గమనించిన ఆర్మీ అధికారి కాల్పులు జరపొద్దంటూ జవాన్లను ఆదేశించారు. నిజానికి ఆర్మీ చెంతకు చేరేప్పటికి అతని ఒంటి మీద చొక్కా కూడా లేదు. ఆర్మీ అతనికి నీళ్లు ఇచ్చి, వివరాలు తెలుసుకొని అతని తండ్రిని అక్కడికి రప్పించి జహంగీర్ ను అప్పగించారు. ఉగ్రవాదం వైపు వెళ్లిన కొడుకు తిరిగి క్షేమంగా రావడంతో… భావోద్వేగానికి లోనయ్యాడు జహంగీర్ తండ్రి. కొడుకును హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు.