పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయంపై సోమవారం ఉగ్రవాదులు దాడి చేశారు. ఇందులో 5 మంది మరణించారు. పాకిస్థాన్ మీడియా కథనం ప్రకారం.. పలువురు టెర్రరిస్టులు కరాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయంలో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 5 మంది చనిపోగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మొత్తం నలుగురు టెర్రరిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిని పాకిస్థాన్ పోలీసులు అణచివేశారు.
స్టాక్ ఎక్స్‌ఛేంజ్ కార్యాలయం మెయిన్ గేటు వద్ద టెర్రరిస్టులు మొదట గ్రెనేడ్లతో దాడికి దిగారు. అనంతరం బిల్డింగ్‌లోకి ఒక్కసారిగా దూసుకువెళ్లి కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. గాయాల బారిన పడిన వారిలో ఒక పోలీస్ ఆఫీసర్, కార్యాలయ సెక్యూరిటీ గార్డు ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని ఆ భవంతిని సీజ్ చేశారు. దాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడిలో గాయాలకు గురైన వారిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిసింది. కాగా టెర్రరిస్టులు భారీ సైజు ఉన్న బ్యాగుల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, గ్రెనేడ్లను తీసుకు వచ్చి దాడికి దిగారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడుల వెనుక ఏ ఉగ్రవాద సంస్థ ఉన్నది.. అనే విషయం ఇంకా నిర్దారణ కాలేదు.