విజయవాడ రాజకీయాల్లో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన వద్ద కు వచ్చే ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి మంత్రి కొన్ని సిఫారసులు చేస్తున్నారు. అయితే, వీటిలో సగానికి సగం సిఫారసులను ప్రభుత్వంలో తోటి మంత్రులు, కీలక అధికారులు బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఏకంగా మంత్రి గారే తల పట్టుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కొందరు నియోజకవర్గానికి చెందిన యువకులు మంత్రిగారిని కలిశారు. “సార్.. మేం కుటీర పరిశ్రమ ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నాం .. ఏపీఐఐసీ నుంచి సాయం అందించేలా చూడండి“ అని కోరారట.
దీంతో మంత్రి వెలంపల్లి.. ఆదరాబాదరాగా తన లెటర్ హెడ్‌పై సదరు యువకుల పేర్లు సహా.. వారు ఏ కు టీర పరిశ్రమను పెట్టుకొవాలనుకుంటున్నారో తెలుపుతూ.. ఏపీఐఐసీ చైర్మన్ రోజాను సాయం చేయాల ని కోరుతూ.. సిఫారసు చేశారట. ఇది జరిగి రెండు వారాలు అయింది. మళ్లీ ఆ యువకులు తాజాగా మంత్రి గారిని కలిశారు. “సార్ మీరు ఇచ్చిన సిఫారసు లెటర్.. తీసుకు వెళ్లాం సార్. అయినా మా పనులు కాలే దు“అని చెప్పడంతో మంత్రిగారి దిమ్మతిరిగిపోయిందట. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న తను సిఫారసు చేస్తేనే పనులు కావడం లేదా? ఏం జరిగిందో చూస్తానంటూ..ఏకంగా చైర్మన్ రోజాకే ఫోన్ చేయించారట.
అయితే, ఆమె మాత్రం స్పందించలేదు. రోజా పీఏ స్పందించి.. మేడం గారు అందుబాటు లో లేరు.. వచ్చాక ఫోన్ చేస్తారు. అని చెప్పాడట.
అయితే, ఇప్పటి వరకు కూడా రోజా నుంచి మంత్రికి ఫోన్ రాలేదు. ఈ పరిణామంతో మంత్రి చుట్టూ.. విమ ర్శలు వస్తున్నాయి. మంత్రి గారి సిఫారసులకు వాల్యూలేదు.. ఆయనకు చెప్పుకొన్నా ఒక్కటే.. చెప్పుకోక పోయినా ఒక్కటే.. అనే ప్రచారం సాగుతోంది. ఇదిలావుంటే, మరో వాదన తెరమీదికి వచ్చింది. రోజా తన నియోజకవర్గం నగరికి సంబంధించి.. దేవాదాయ పరిధిలో ఉన్న ఓ సమస్యను పరిష్కరించాలని, ఇక్కడ ప్రజలకు అది అత్యవసరమని.. కోరుతూ.. రెండు నెలల కిందట మంత్రిగారికి లెటర్ పంపిచారని తెలిసింది.
దీనికి మంత్రి వెలంపల్లి ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో రోజా హర్ట్ అయ్యారని, అందుకే మంత్రిగారికి సరైన సమయం చూసుకుని షాక్ ఇచ్చారని అంటున్నారు. మొత్తానికి మంత్రి వర్సెస్ రోజా ఎపిసోడ్లో వారి మూలంగా.. సామాన్యులు నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తుండడం గమనార్హం.