హస్తరేఖలను బట్టి జాతకం చెప్పేస్తారు. కొందరూ వీటిని బలంగా నమ్ముతారు..మరికొందరు అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తుంటారు. కడుపులో ఉన్నప్పుడు బేబీ ముడుచుకుని ఉంటుంది కదా..అలా చేతిలో రేఖలు ఏర్పడతాయి.. దీనికి జాతకంకు ఏంటి సంబంధం అని కొంతమంది పట్టించుకోరు. అయితే జోతిష్య పండితులు ఈ రేఖలను బట్టే ఆరోగ్యం, ఆయుష్షు, వివాహం, సంతానం, అదృష్టం, ఆర్థికం ఇలా ఒక్కో అంశాన్ని చెప్పేస్తారు. థాయ్‌లాండ్ ప్రజలు ఈ హస్తసాముద్రికాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు. ఆ నమ్మకాన్నే ఓ కంపెనీ ఇప్పుడు క్యాష్ చేసుకుంటోంది. అదృష్టం తెచ్చిపెట్టే రేఖల్ని కృత్రిమంగా సృష్టిస్తామంటూ ప్రజలను ఆకర్షిస్తోంది. అంటే..మనకు నచ్చినట్లుగా రేఖలు గీయించుకుంటే..అదృష్టం వస్తుందని వాళ్లను బుట్టలో పడేస్తున్నారు.
థాయ్‌లాండ్‌కి చెందిన ప్రొఫెసర్ ప్లీ అనే వ్యక్తి గతంలో టాటూలు వేసే వృత్తిలో ఉండేవారు. ఇటీవల నొంతాబురి ప్రాంతంలో ‘మహాహెంగ్999’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి.. ప్రజలు మెరుగైన జీవితం పొందడం కోసం వారి చేతిలోని రేఖలను కావాల్సినట్టుగా మారుస్తామని ప్రకటించారు. దీంతో మంచి భవిష్యత్తుకోసం ప్రజలు ఆ కంపెనీ ముందు క్యూ కట్టారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ముందుగా హస్తసాముద్రికం తెలిసిన నిపుణులు హస్తరేఖల్ని చూసి ఏవి బలహీనంగా ఉన్నాయో.. ఏయే రేఖల్ని మార్చుకోవాలో చెప్తారట. వారు చెప్పినదాన్ని బట్టీ… కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తరేఖల్ని మార్చడం.. కొత్తవి గీయడం వంటివి చేస్తున్నారు. వింటుంటే విడ్డూరంగా ఉంది కదూ..పిచ్చి పీక్స్ కి వెళ్తే ఇలానే చేస్తారని మీకు అనిపిస్తుందా..కానీ ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని మార్చుకున్న వాళ్లు చెప్పడం విశేషం.
టాటూల తరహాలోనే అరచేతిలో రంగులు లేకుండా గీతల్ని గీస్తున్నారు. మొదట్లో చర్మం బాగా కందిపోతుంది. ఆ తర్వాత అవి సహజరేఖల్లానే మారుతాయి.. దీంతో ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు.. కరోనా సంక్షోభంలో కష్టాల్ని అనుభవిస్తున్నవారు.. హస్తరేఖల్ని మార్చుకోవడం కోసం ఎగబడుతున్నారు. కనీసం ఇలాగైనా తమ జీవితంలో మంచి రోజులు వస్తాయోమోనని భావిస్తున్నారు. అనతికాలంలోనే ఈ కంపెనీ గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరిగటంతో..కస్టమర్లు అధికంగా వస్తుండటంతో ప్లీ బిజినెస్ మూడు పువ్వులు..ఆరు రేఖలు అన్నట్లు సాగుతుంది. ఈ కంపెనీ మరో బ్రాంచ్‌ను కూడా ప్రారంభించనున్నారట.
తన హస్తరేఖల్ని మార్చుకోవడం వల్లే తన వ్యాపారం అభివృద్ధి చెందిందని ప్లీ చెబుతున్నారు. పలువురు కస్టమర్లు కూడా చేతిగీతల్ని మార్చుకున్న తర్వాత మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారట.. చేతిరేఖల్ని నమ్మడమే విడ్డూరం అనుకుంటే.. ఏకంగా కృత్రిమ రేఖల్ని సృష్టించుకోవటం ఏంట్రా బాబూ అనిపిస్తుందా..చెప్పలేం, ఏమో జరుగుతుందేమో..!