తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు పలు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడంపై ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.
2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారు. కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్లను పూర్తిగా తొలగించారు అని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరిట ఆ ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారు. కానీ ఇది ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు అనిపిస్తుంది అని మండిపడ్డారు .2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించారు. కేసీఆర్ పరిపాలనకు సంబంధించిన వేల ఫొటోలు, వీడియోలు, ముఖ్యమైన సమాచారాన్ని వెబ్‌సైట్లతో పాటు సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తొలగించేశారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమైన కంటెంట్‌ను ఆర్కైవ్స్‌లో భద్రపరచాలి. కానీ ఇలా తొలగించడం సరికాదు అని ఫైర్ అయ్యారు.