తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తదని, మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటదని మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చిపిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత అలాగే జరిగిందని కేసీఆర్ గుర్తుచేశారు.
మంగళవారం రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్లు అందరూ రాష్ట్రం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, విజయవంతంగా పదవీకాలాన్ని పూర్తి చేసినందుకు శుభాకాంక్షలని చెప్పారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ,ప్రజా జీవితంలో ఒకసారి నిలిచిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులని ఆయన అన్నారు.10 సంవత్సరాల బీఆర్‌ఎస్ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు, తాగునీటి ఇబ్బందులతోపాటు శాంతి భద్రతల సమస్య తలెత్తి బాధ కలిగిస్తున్నదని కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.