తెలంగాణలో ఇప్పుడు పుట్ట మధు టాపిక్ చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు టీఆర్ ఎస్ నేతలెవరూ పుట్ట మధు అరెస్టుపై స్పందించలేదు. కాగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ పుట్ట మధుఅరెస్టుపై స్పందించారు. ఆయన చేసిన పనులకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. వామన్‌రావు తండ్రి కోర్టులో పిటిషన్ వేశారని, అందుకే కోర్టే జోక్యం చేసుకుందన్నారు.
ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, విచారణలో భాగంగానే ఆయన అరెస్టు అయ్యారని చెప్పారు. అయితే నిజాలు పూర్తిగా బయటకు వచ్చిన తర్వాతే పార్టీ పరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వామన్‌రావు దంపతుల హత్యను సీఎం కేసీఆర్ ఖండించారని, తప్పు చేసింది ఎవరైనా విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఉమ్మడి జిల్లా మంత్రిగా తన బాధ్యత మేరకు వివరణ ఇస్తున్నట్టు తెలిపారు. అయితే వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు ఇవన్నీ జరుగుతున్నట్టు ఆయన మాటల్లో అర్థమైంది. కానీ ప్రభుత్వం పుట్టమధు అరెస్టుకు ఆదేశాలు ఇచ్చిందా లేదా అనే విషయం ఆయన స్పష్టంగా చెప్పకపోవడం ఇక్కడ గమనార్హం.