భారత్ కరోనా సంక్షోభం నుంచి బయట పడాలంటే దీర్ఘకాలిక పరిష్కారం వ్యాక్సిన్లను వేయడమేనని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థతో ఆయన తాజాగా మాట్లాడారు. ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉందని, అయితే వ్యాక్సిన్లను తయారు చేసేందుకు కావల్సినంత ముడి సరుకు లేదని, దానిపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఇక భారత్‌లో కరోనాను కట్టడి చేసేందుకు, కరోనా చెయిన్‌ను బ్రేక్ చేసేందుకు ఇప్పటికే అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించి అమలు చేస్తున్నాయని, అయితే దేశవ్యాప్తంగా పూర్తిగా షట్‌డౌన్ చేస్తేనే కోవిడ్ చెయిన్ బ్రేక్ అవుతుందని అన్నారు. చైనాలో గతేడాది కరోనా తీవ్ర రూపం దాల్చినప్పుడు అక్కడ హాస్పిటళ్లను వేగంగా నిర్మించారని, భారత్ కూడా సరిగ్గా అదే నమూనాను అనుసరించాలని అన్నారు.
కాగా దేశంలో గత వారం రోజులుగా రోజుకు 4 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా ప్రధాని మోదీ రోజూ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఏయే రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా సీఎంలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.