టీడీపీకి బలమైన జిల్లా విజయనగరం. ఇక్కడ నుంచి కొన్ని దశాబ్దాలుగా పార్టీలో చక్రం తిప్పుతున్న అశోక్ గజపతిరాజు వంటి వారు ఉన్నారు. అయితే.. ఇప్పుడు పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడింది. పార్టీలో కీలక నేతగా ఉన్న మీసాల గీత గతంలో 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైసీపీపై దూకుడుగా విమర్శలు కూడా చేశారు. అయితే.. ఇప్పుడు ఈమె పార్టీలో తనకు ప్రాదాన్యం లేకుండా పోయిందని. ఆది నుంచి పార్టీకి అన్ని విధాలా తాను అండగా ఉన్నా.. ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. తనదైన శైలిలో వేరు కుంపటికి కూడా రెడీ అవుతున్నారు.
2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గీతకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం.. అశోక్ కుమార్తె అదితి రంగంలోకి దిగడమే. నిజానికి తాను గెలుపు గుర్రం ఎక్కుతానని తనకు టికెట్ ఇవ్వాలని ఆమె అప్పట్లో కోరినా.. బాబు పట్టించుకోలేదు. దీంతో దీనికి అశోకే కారణమంటూ.. ఆయనపై గుర్రుగా ఉన్నారు. పోనీ.. ఇటీవల పార్టీలో పార్లమెంటరీ జిల్లా ఇంచార్జులను నియమించారు. అదేసమయంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాటిలోనూ గీతకు ఛాన్స్ దక్కలేదు. దీనికి కూడా వెనుకాల అశోక్ ఉన్నారనేది ఆమె వాదన.
దీంతో ఇప్పుడు ఇద్దరు నాయకుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఆమె .. తన సామాజికవర్గానికి చెందిన కేడర్‌ను కాపాడుకోవడానికి విజయనగరంలో కొత్త ఆఫీసు ప్రారంభానికి గీత సిద్ధమవుతున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి టీడీపీ కేడర్‌లో కన్ఫ్యూజన్ మొదలైంది.
రోజు రోజుకూ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఈ సమస్యపై గ్యాప్ పెరుగుతున్నట్టు సమాచారం. దీనిపై కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నా పైకి మాట్లాడటానికి సాహసించడం లేదట. మరోవైపు.. వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల గీతకు టచ్‌లో ఉన్నారు. ఆమె వస్తానంటే.. సీఎంతో మాట్లాడి చేర్చుకునేందుకు ఏర్పాటు చేస్తానని కూడా హింటిస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.