ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హవా మామూలుగా ఉండదు. ఇక విశాఖ జిల్లాతో పాటు విశాఖ నగర రాజకీయాల్లో గంటా ఏం చెపితే అదే.. పార్టీలు మారినా కూడా అందుకు తగ్గట్టుగానే తన అధికారాన్ని ఆయన నిలుపుకుంటూ వస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఏడేళ్లుగా మంత్రిగా విశాఖ జిల్లా రాజకీయాలను శాసించిన ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి లేదు.. కేవలం నగరంలో ఓ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఓ వైపు వైసీపీ అధికారంలో ఉంది… తన పాత సన్నిహితుడు, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు గంటాను పదే పదే టార్గెట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేసుల భయంతో పాటు, రాజకీయ భవిష్యత్తు.. కుమారుడి భవిష్యత్తు ఇవన్నీ ఆలోచించుకుని గంటా వైసీపీలోకి జంప్ చేసేంందుకు కొద్ది నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు తెలిసిందే. ఆగస్టులోనే ఆయన నాలుగైదు ముహూర్తాలు చూసేసుకున్నారని.. పార్టీ మారడమే లేట్ అన్న పుకార్లు ఎక్కువ వినిపించాయి. ఈ వార్తలు బయటకు వచ్చిన వెంటనే మంత్రి అవంతి, విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు గంటా కేసులు మాపీ కోసమే పార్టీ మారుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయినా గంటా మాత్రం వేరే ఛానెల్లో జగన్‌ను కలిసి పార్టీ మార్పు కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు గంటా విషయంలో వైసీపీ రాజకీయం మారిందని అంటున్నారు. జగన్ కూడా పలు సర్వేల ద్వారా తెప్పించుకున్న సమాచారం ప్రకారం గంటటాను పార్టీలో చేర్చుకున్నా గంటాకే ఉపయోగం కాని.. పార్టీకి, ప్రభుత్వానికి ఒరిగేదేం ఉండదని.. పైగా ఇప్పటికే ప్రశాంతంగా ఉన్న విశాఖ వైసీపీ రాజకీయంలో మరిన్ని కొత్త గ్రూపులు ఏర్పడతాయని.. ఇది పెద్ద తలనొప్పి అని జగన్ డిసైడ్ అయ్యారట. ఇక కొందరు ఎమ్మెల్యేలు సైతం గంటా వల్ల పార్టీకి ఉపయోగం లేదని కలిసికట్టుగా సీఎంకు ఫిర్యాదు చేశారట. ఈ ఫిర్యాదుల వెనక మంత్రి అవంతి, విజయసాయి రెడ్డి ఉన్నారన్న ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా గంటా వైసీపీ ఎంట్రీకి సాక్షాత్తు జగనే బ్రేక్ వేశాడని తెలుస్తోంది.