ఐఫోన్ ఫ్యాక్ట‌రీపై వ‌ర్క‌ర్ల దాడి వెనుక ఉన్న అస‌లు కార‌ణం అదే..?

-

బెంగ‌ళూరుకు స‌మీపంలోని న‌ర‌స‌పుర ప్రాంతంలో ఉన్న విస్ట్రాన్ అనే కంపెనీకి చెందిన కాంట్రాక్టు కార్మికులు ప‌రిశ్ర‌మ‌పై దాడి చేసి అందులోని సామ‌గ్రిని ధ్వంసం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యం సంచ‌ల‌నంగా మారింది. కార్మికుల దాడిలో మొత్తం రూ.437 కోట్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్లు కంపెనీ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అయితే న‌ష్టం రూ.43 కోట్లేన‌ని కంపెనీ మాట మార్చింది. కానీ ఆ కంపెనీ ఇలా ఎందుకు మాట మార్చింది ? అన్న విష‌యంపై ఇంకా స్ప‌ష్టత రాలేదు.

the actual cause of vandalism on wistron factory is this

అయితే కాంట్రాక్టు కార్మికులకు వేత‌నాలు స‌రిగ్గా చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఫ్యాక్ట‌రీపై దాడులు చేశార‌ని ప్రాథ‌మికంగా తెలిసింది. కానీ పోలీసుల విచార‌ణ‌లో మాత్రం షాకింగ్ వివ‌రాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. అస‌లు కొంద‌రు కార్మికులు ఆ రోజు విధుల‌కు హాజ‌రు కాక‌పోయినా పోలీసులు వారిని అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డైంది. అలాగే కాంట్రాక్టు కార్మికుల‌కు కంపెనీలు రూ.22వేల వ‌ర‌కు వేత‌నం ఇస్తామ‌ని చెప్పి విస్ట్రాన్ కంపెనీలో పెట్టాయి. కానీ నెల‌కు రూ.6వేల నుంచి రూ.9వేల వ‌రకు మాత్ర‌మే జీతాల‌ను ఇస్తున్న‌ట్లు వెల్ల‌డైంది. అలాగే ప‌నిగంట‌లు 12 గంట‌లు ఉన్నాయ‌ని, ఇష్టం వ‌చ్చిన‌ట్లు షిఫ్టుల్లో విధుల‌కు ర‌మ్మంటున్నార‌ని, మ‌హిళ‌ల‌కు రాత్రి షిఫ్టులు వేస్తున్నార‌ని, త‌మకు స‌మ‌స్య‌లు ఉంటే ప‌ట్టించుకునే వారు లేర‌ని, అస‌లు విస్ట్రాన్ కంపెనీలో ప‌ర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు ఎవ‌రికైనా స‌రే యూనియ‌న్ లేద‌ని.. అందువల్లే విసిగిపోయిన కాంట్రాక్టు కార్మికులు ఫ్యాక్ట‌రీపై దాడులు చేశార‌ని వెల్ల‌డైంది.

కాగా ప్ర‌స్తుతం పోలీసులు ఆ కంపెనీ వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. దీంతో కంపెనీలోకి మ‌ళ్లీ వ‌ర్క‌ర్లు వ‌చ్చి విధుల్లో చేరుతున్నారు. అయితే విధ్వంసం సృష్టించిన కార్మికుల‌ను ప్ర‌స్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించే ప‌నిలో ప‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news