శుక్రవారం మధ్యాహ్న సమయంలో ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ములుగు ఎమ్మెల్యే సీతక్క కారులో అక్కడికి వచ్చారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకునే క్రమంలో ఓ మహిళా పోలీస్ ఆమె పై చేయి వేయడంతో… ఉగ్రరూపం దాల్చిన ఎమ్మెల్యే సీతక్క ఆమెను హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్యే మధ్య ఏకంగా తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కాగా ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ కిసాన్ సెల్ నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్ రైతుల గురించి అసెంబ్లీ వేదికగా అసలు చర్చ కూడా జరపలేదని… ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రైతాంగం మొత్తం ఎంతగానో నష్టాల్లో కూరుకు పోయిందని.. వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి అంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. సభలో కనీసం రైతుల సమస్యలపై మాట్లాడే సమయం కూడా తనకు ఇవ్వలేదు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు.