జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానులు అసంతృప్తితో ఉన్నారా..?? పవన్ కళ్యాణ్ పై మునుపటిలా అభిమానాన్ని చాటలేక పోతున్నారా..?? జనసేన కి అభిమానులకి మధ్య గ్యాప్ బాగా బాగా పెరిగిపోయిందా అంటే అవుననే అంటున్నారు కొందరు జనసేన వర్గం నేతలు. జగన్ ఫ్యాను గాలికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబే కొట్టుకుపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ఎంత అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో ఎలాగో టీడీపీకి కోలుకునే పరిస్థితి లేదు, ఇక కొద్దో గొప్పో జనసేన మాత్రమే వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే పరిస్థితి నెలకొన్న తరుణంలో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. పవన్ కి ఉన్న ఏకైక బలం అభిమానులే మరి ఆ అభిమానులే దూరం అయితే..?? ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం ఈ విషయంపైనే దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నవరత్నాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళే క్రమంలో జగన్ గ్రామ వాలంటీర్లని ఏర్పాటు చేసిన విషయం విధితమే.
ఈ వాలంటీర్ల ఎంపికలో వైసీపీ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఒక వైపు పార్టీ భేదం లేకుండా వాలంటీర్లని ఎంపిక చేస్తూనే, మరో వైపు నిరుద్యోగులుగా ఉన్న పవన్ అభిమానులలో కొంతమందిని ఎంపిక చేసి వారిని తమవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేసింది. దాంతో ప్రతీ గ్రామంలో ఉన్న వైసీపీ నేతలు జనసేనలో ఉన్న యువతని తమవైపుకి తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. అయితే జనసేన అభిమానులు జగన్ శిబిరం వైపు ఆకర్షితులు అవ్వడానికి కూడా కారణం లేకపోలేదట.
ఎన్నికలముందు అంటే పవన్ ప్రజా పోరాట యాత్ర చేపట్టి ఎన్నికలు జరిగే వరకూ పవన్ కళ్యాణ్, జనసేన కీలక నేతలు అభిమానులని, కార్యకర్తలని పట్టించుకునే వారట, కానీ ఎన్నికల అనంతరం మమ్మల్ని పట్టించుకున్న నాధులు లేదని వాపోతున్నారు జనసేన అభిమానులు. అంతేకాదు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే జనసేనలో కీలకంగా ఉంటున్న గ్రామ స్థాయి నేతలని, అభిమానులని ఎన్నో బెదిరింపులకి గురి చేసిందని, ఈ విషయం జనసేన కీలక నేతలకి చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని ఆ సమయంలో వైసీపీ నేతలు మాకు అండగా నిలిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. . అంతేకాదు ప్రస్తుత పరిస్థితులలో జగన్ కి ఎదురు నిలిచి విజయం సాధించేలా కనుచూపు మేరలో ఏ పార్టీలు కనిపించడం లేదని అందుకే జగన్ కే మా మద్దతు అంటున్నారట పవన్ అభిమానులు. ఇదే ఆలోచన మిగలిన అభిమానులలో కూడా కలిగితే ఇక పవన్ ఏపీలో తట్టా బుట్టా సద్దేసుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.