ఆంధ్రావనిలో ఇవాళ మరో విప్లవాత్మక ఆలోచనకు పునః శ్రీకారం దిద్దనున్నారు. వసతి దీవెన పేరిట జగన్ ఇదివరకే ప్రకటించిన మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు. దీంతో యాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన మాట మరోసారి నెరవేరనుంది. ఆర్థికంగా ఒడిదొడుకులు ఉన్నా ముందుగా నిర్ణయించిన సంక్షేమ క్యాలెండర్ ను అనుసరించి ఈ నెల మొదటి వారంలోనే అంటే ఏప్రిల్ మొదటి వారంలోనే సంబంధిత కార్యాచరణకు సీఎం సుముఖంగా ఉండడం ఓ శుభ పరిణామం. ఇప్పటికే విద్యాదీవెనను అమలు చేస్తున్నారు. చదువుతోనే మంచి ప్రగతి మంచి మార్పు సాధ్యం అని నమ్మే జగన్ కు ఆ విధంగా నడిపే శక్తులు కూడా తోడుగా ఉన్నాయి.
బాగా చదువుకున్న మాజీ ఐఆర్ఎస్ ఆదిమూలం సురేశ్ (నిన్నటి దాకా విద్యాశాఖ మంత్రి), అదేవిధంగా నిన్నటి దాకా ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (నిన్నటిదాకా ) వంటి వారు తోడుగా ఉండడంతో ముందు నిర్ణయించిన విధంగా ఆయన విద్యాదీవెనకు నిధులు కేటాయించారు. గత ఏడాది కి సంబంధించి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఉన్న త్రైమాసికానికి 709 కోట్లు వెచ్చించారు. ఇప్పుడు వసతి దీవెన పేరిట (రెండో విడత) 10లక్షలకు పైగా విద్యార్థులకు (ఇంకా చెప్పాలంటే 10,68,150 మంది విద్యార్థులకు) మేలు చేసే విధంగా జగన్ నిర్ణయించి 1024 కోట్లు విడుదల చేయనున్నారు.ఈ మొత్తం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. ఉన్నత విద్య ను అభ్యసించే వారికి భోజన, వసతి ఖర్చులు కూడా ప్రభుత్వం తరఫున భరించాలని గతంలోనే జగన్ నిర్ణయించారు. ఆ విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం వరుసగా రెండో సారి కూడా అమలు కావడం నిజంగానే హర్షణీయం. శుభ పరిణామం కూడా !