ఉగాది ప్రాముఖ్యత అంటే చైత్ర శుద్ద పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టి నిర్మాణం ప్రారంభించిన రోజు అని నమ్ముతారు. ఉగాది ని యుగాది అనికూడా వ్యవహరిస్తారు. యుగము యొక్క ఆది గా చెప్పబడుతుంది. యుగము అంటే ద్వయము లేదా జంట అని కూడా అర్థము. రెండు ఆయనముల కాలము సంవత్సరము అనగా ఉత్తరాయనము, దక్షిణాయనము ల సమ్మేళనం. యుగానికి ఆదిగా యుగాది లేదా ఉగాదిగా వాడుక లోకి వచ్చింది.
విష్ణు మూర్తి మత్చ్యయావతారములో సోమకుడిని సంహరించి వేదాలను బ్రహ్మ కు అప్పగించిన రోజు ఉగాది గా చెప్పబడినట్లు పురాణ గాధ. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండగ వాడుకలోకి వచ్చింది అని మరొక పురాణ గాధ.ఉగాది అంటే ఉగా అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది. సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. అసలు మన ఉగాది చైత్ర మాసంలోనే ఎందుకు మొదలౌతుందో తెలుసా. మన దేశం లో పుష్య, మాఘ మాసాలు పంటలు పండి ప్రకృతి రసభరితం గా ఉండే కాలం.
ప్రజలు తమ శ్రమ ఫలితాన్ని కళ్ళెదుట చూస్తూ పొంగిపోతారు. ఇదే సంవత్సరాది గా చెప్పుకునేవారు.ఒక్క తెలుగు సంప్రదాయకంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాన్డుగా, మళయాళం లో విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖి గాను, బెంగాలీలు పోయ్ లా బైశాఖ్ గాను ఉగాదిని జరుపుకుంటారు. ఈ రోజున వేప పువ్వు పచ్చడి, పంచాంగ శ్రవణం, మిత్ర దర్శనం , ఆర్య పూజనం, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు.