జలవివాదంపై రేపు కృష్ణా బోర్డు కీలక సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై రేపు జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. ఈ కేఆర్ఎంబి మీటింగ్ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలకు జరుగనుంది. కేఆర్ఎంబి – జిఆర్ఎంబీ సంయుక్తంగా సమావేశం నిర్వహించనుంది. ఆగస్టు 3న నిర్వహించిన కృష్ణా, గోదావరి బోర్డుల కోఆర్డినేషన్ మీటింగ్, 9న నిర్వహించిన కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ జాయింట్ మీటింగ్ కు తెలంగాణ గైర్హాజర్ అయిన విషయం తెలిసిందే.

అయితే.. కేఆర్ఎంబీ 14వ సమావేశానికి హాజరవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. దీంతో రేపటి సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ పై ఈ సందర్భంగా తెలంగాణ అభ్యంతరాలు తెలపనుంది. కృష్ణా బోర్డు సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, నీటి పంపకాలతో పాటు బోర్డుల పరిధి, అమలుకు సంబంధించిన అంశాలే ఎజెండాగా ఈ సమావేశం జరుగనుంది. కేంద్రం విడుదల చేసిన గెజిట్ లోని క్లాజుల అమలుపై జిఆర్ఎంబీ సమావేశంలో చర్చ జరుగనుంది. ఈ సమావేశం లోనైనా… ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదానికి తెరపడుతుందో ? లేదో ? చూడాలి.