వామ్మో: 17 మంది మహిళలను హత్య చేసిన నరహంతకుడు.. జీవిత ఖైదు..!!

ఓ నరహంతకుడు ఏకంగా 17 మంది మహిళలను హత్య చేశాడు. మద్యం సేవించే మహిళలే లక్ష్యంగా.. వారి ఒంటి బంగారం, వెండి నగలు కనిపిస్తే చాలు.. వారిని మాటల్లో పెట్టి.. నిర్మానుష్యమైన ప్రాంతాలకు తీసుకెళ్లి అతి కిరాతంగా హతమార్చేవాడు. సొంత తమ్ముడిని కూడా మట్టుబెట్టిన చరిత్ర అతడిది. అలాంటి ఓ నరహంతకుడిని గద్వాల కోర్టు మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించాడు.

ఎరుకలి శ్రీను
ఎరుకలి శ్రీను

2019 డిసెంబర్ 17వ తేదీన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో నవాబ్‌పేట మండలం కూచూరు గ్రామానికి చెందిన అలివేలమ్మ (53) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ఇచ్చిన సమాచారం మేరకు ఆమె హత్య కేసులో పాత నేరస్థుల పాత్ర ఉందని తెలపడంతో.. పోలీసులు పలువురి విచారించారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండేడుకు చెందిన ఎరుకల శ్రీను(47) విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎరుకలి శ్రీను గతంలోనూ ఎన్నో హత్య చేశాడని దేవరకద్ర ఎస్ఐ భగవంతరెడ్డి తెలిపారు. కల్లు కాంపౌండ్‌లో తాగడానికి వచ్చే మహిళలే టార్గెట్‌గా హత్యలు చేసే వాడని, అలా చాలా సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పలు హత్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదు విధించడం జరిగిందన్నారు.