చరిత్రలో ఎంతో మంది సైంటిస్టులు, మేథావులు.. మనకు మేలు చేద్దామని ఎన్నో ఆవిష్కరణలు చేశారు. మనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పారు. కానీ అప్పట్లో జనాలు వారిని పిచ్చివాళ్లని అన్నారు. కొందరిని కొట్టి చంపారు కూడా. కానీ ఆ సైంటిస్టులు చెప్పిన విషయాలు, చేసిన ఆవిష్కరణలు అన్నీ నిజాలేనని తరువాతి కాలంలో తెలిశాయి. అయితే ఏం లాభం.. వారిని భూమిపై జీవించకుండా చేసింది ఈ సమాజం. అవును.. ఆ డాక్టర్‌ను కూడా కొందరు అలాగే చేశారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని చెప్పినందుకు కొట్టి చంపారు. ఇంతకీ ఆయన ఎవరంటే..?
ఆస్ట్రియాలోని వియన్నాకు చెందిన డాక్టర్ ఇగ్నాజ్ సెమ్మెల్‌వెయిస్ 1818లో జన్మించారు. ఆయన డాక్టర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాక 1847లో చైల్డ్‌బెడ్ ఫీవర్ వల్ల చాలా మంది చనిపోవడం మొదలైంది. అయితే దీనికి కారణం అపరిశుభ్రంగా ఉండే చేతులేనని, చేతులను శుభ్రంగా కడుక్కుంటే ఒకరికొకరు తాకినా ఆ వ్యాధి సంక్రమించదని, దీంతో ప్రాణాలు పోకుండా సురక్షితంగా ఉండవచ్చని ఆయన చెప్పారు. ఇక చేతులను శుభ్రంగా కడుక్కునేందుకు గాను ఆయనే స్వయంగా కాల్షియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని తయారు చేశారు. అయితే ఆయను అప్పటి ప్రజలు నమ్మలేదు. అంతేకాదు ఆయనతో పనిచేసే తోటి డాక్టర్లు కూడా ఆయన్ను నమ్మలేదు. దీంతో జనాలు చనిపోవడానికి ఆయనే కారణమని వారు ప్రచారం చేశారు. దీంతో డాక్టర్ ఇగ్నాజ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
డాక్టర్ ఇగ్నాజ్ చేస్తున్న చర్యల వల్ల జనాలు చనిపోతున్నారని తోటి డాక్టర్లే చెప్పే సరికి ఆయనను మెడికల్ కమ్యూనిటీ, ప్రజలు తీవ్రంగా హింసించారు. దీంతో ఆ బాధకు ఆయన వియన్నా నుంచి బుడాపెస్ట్‌కు వెళ్లారు. అక్కడ 1865లో ఆయన తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత ఆయన్ను అక్కడే ఒక అసైలమ్‌లో చేర్చారు. అనంతరం 14 రోజులకు ఆయన చనిపోయారు. అక్కడ సిబ్బంది ఆయన్ను దారుణంగా గాయపరిచారు. దీంతో ఆ గాయాలు పెద్దవై వాటి ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆయన చనిపోయారు. అప్పుడాయనకు కేవలం 47 సంవత్సరాలే.. అలా ఆ డాక్టర్‌ను అప్పటి సమాజం చంపేసింది.
అయితే డాక్టర్ ఇగ్నాజ్.. చేతులను శుభ్రంగా కడుక్కోవాలని ఎంత చెప్పినా ఎవరూ వినలేదు. ఆయన సూచనలను అందరూ అప్పట్లో పెడచెవిన పెట్టారు. అయితే జనాల్లో ఆ విషయంపై అవగాహన కల్పించాలని చెప్పి ఆయన అప్పట్లో Etiology, Concept and Prophylaxis of Childbed Fever అనే పుస్తకం కూడా రాశారు. కానీ మెడికల్ కమ్యూనిటీ దాన్ని తిరస్కరించింది. ఆయనతో కొందరు వైద్యులకు ఉన్న వైరం, పలువురు వైద్యులు ఆడిన పాలిటిక్స్ గేమ్‌లో డాక్టర్ ఇగ్నాజ్ బలయ్యారు. కానీ ఆయన చెప్పిన హ్యాండ్ వాష్ అనేది ఇప్పుడు ఎంతో ఆవశ్యకమైంది. ఏది ఏమైనా.. అలాంటి ఓ మేథావిని సమాజం తిరస్కరించినందుకు మనమందరం నిజంగా సిగ్గు పడాల్సిందే..!