కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రాహుల్ గాంధీ సహా మరికొంతమంది కాంగ్రెస్ ముఖ్య నేతలు ట్రాక్టర్ నిరసన ర్యాలీ చేపట్టారు. కాగా మూడు రోజులపాటు ట్రాక్టర్ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే ఇటీవలే రాహుల్ గాంధీ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ పై స్పందించిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ట్విట్టర్ వేదికగా రాహుల్ పై విమర్శలతో పాటు వ్యంగ్యాస్త్రాలు కూడా స్పందించారు.
కుషన్ సోఫా వేసుకుని ట్రాక్టర్ పై హాయిగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే అది నిరసన ఎలా అవుతుంది అంటూ ప్రశ్నించారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్. రాహుల్ గాంధీ చేసింది నిరసన కాదు అదొక రకం టూరిజం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేవలం రైతులను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే… రాహుల్ గాంధీ ఈ నిరసన ర్యాలీ చేపట్టారు అంటూ ఎద్దేవా చేశారు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్. కాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్రాక్టర్ పై కుషన్ సోఫాలో కూర్చుని నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశంపై అటు పలువురు బీజేపీ నేతలు సైతం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉండడం గమనార్హం.