మహారాష్ట్రలో అధికార పక్షమే లక్ష్యంగా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే మంత్రివర్గంలోని ఓ మంత్రిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్ పరబ్ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని పరబ్ అధికార నివాసంతోపాటు ఆయన కుటుంబసభ్యుల ఇంట్లో సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధన చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ఆయనపై పలు కేసులు నమోదు చేశారు.
మంత్రి అనిల్ పరబ్‌కు డపోలీ సిటీలో ఓ రిసార్ట్ ఉంది. దానిని ఆయన 2017లో రూ. కోటి వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2019లో ఆ రిసార్ట్ ని సదానంద్ కదమ్ అనే వ్యక్తికి రూ.1.10 కోట్లకు అమ్మేశారు. 2020లో అక్కడ నిర్మాణాలు చేశారు. అయితే అప్పట్లోనే రిసార్టు వ్యవహారంలో రూ.6 కోట్లు అక్రమాలు జరిగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ పేర్కొంది.