ఇరవైయ్యేళ్ల క్రితం కంప్యూటర్లను గడగడలాడించిన వై2కే బగ్ లేదా మిలీనియం బగ్ ఇప్పుడు మళ్లీ మరో అవతారమెత్తింది. ఈ కొత్త సంవత్సరాన్ని కూడా సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోంది.
2000వ సంవత్సరం జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన కంప్యూటర్ సమస్య గుర్తుందా? తేదీ గణనలో రెండు అంకెల సంవత్సరాన్ని 00గా గుర్తించడంవల్ల అది కాస్తా 1900గా మారిపోయింది అప్పట్లో. దాంతో కోట్లాది కంప్యూటర్లు అయోమయానికి గురై, వేలాది సంస్థల కార్యకలాపాలు పూర్తిగా స్థంబించాయి.
కంప్యూటర్ల ఆపరేటింగ్ సిస్టమ్ తయారుచేయబడిన కొత్తల్లో , ప్రోగ్రామర్లు తేది పరిమాణాన్ని 100 సంవత్సరాలుగా తీసుకుని (1900 నుండి 1999 వరకు) ప్రోగ్రాం రాసారు. దీనివల్ల రెండంకెల తేదీ వేసినా, నాలుగంకెల ఏడాదిగా తీసుకునేది. 1999 వరకు ఏ సమస్యా లేకుండా సాగిపోయింది. అయితే 2000వ సంవత్సరం రాగానే కంప్యూటర్లు దాన్ని 1900గా పరిగణించాయి. దాంతో బ్యాంకులు, ఇతర వాణిజ్య సంస్థల నెట్‌వర్క్‌ల లెక్కల్లో తప్పులు దొర్లడం ప్రారంభమయింది. ప్రపంచమంతా గగ్గోలు పుట్టింది. వెంటనే ప్రోగ్రామర్లు ఈ సమస్యను అధిగమించడానికి తాత్కాలికంగా మరో చిన్న ప్రోగ్రాం రాసి దాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. దాన్ని ‘విండోయింగ్’ గా వ్యవహరించారు. దాంతో సమస్య శాంతించి, ఉపశమనం లభించింది. అయితే అప్పటి సమస్యను సాల్వ్ చేసిన ఆ చిన్న ప్రోగ్రాం ఇప్పుడు మళ్లీ అదే సమస్యను సృష్టించింది. ఆ తాత్కాలిక ఉపశమనం ‘విండోయింగ్’, వారి బద్ధకం మూలంగా మరోసారి తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధమయింది.
అప్పట్లో విండోయింగ్‌గా వాడింది తేదీని ఒక 20 ఏళ్లు జరపడానికి. అంటే వందేళ్ల కాలాన్ని 1920 నుండి 2019 వరకు సవరించారు. నిజానికి అప్పుడే వారు ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటే అయిపోయేది. అయితే 2020వరకు ఇప్పటి కంప్యూటర్ వ్యవస్థలేవీ ఉండవని భావించడం మూలాన దాన్ని అలా వదిలేసారు. అయితే వారు వదిలేసినట్లుగా కొన్ని కక్కుర్తి కంపెనీలు ఆ కంప్యూటర్లను వదల్లేదు. ఇందులో చాలా పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. అందువల్ల వై2కే 2.0 మళ్లీ పుట్టింది. ఇప్పటికే అమెరికాలోని పార్కింగ్ వ్యవస్థలు, క్యాష్ రిజిస్టర్లు, బ్యాంకింగ్ సంస్థలు దీని బారిన పడ్డాయి. సాఫ్ట్‌వేర్ తయారీదారులు, గేమింగ్ కంపెనీలు కూడా ‘వై2020’ కి బలైనట్లు సమాచారం.
వై2020కే బారిన పడ్డ కంపెనీల జాబితా తెలియని కారణాన, ఈ సమస్య ఎప్పుడు అంతమవుతుందో ప్రస్తుతానికి అంతుబట్టడంలేదు. కాకపోతే ఆయా సంస్థలు కంప్యూటర్ ప్రోగ్రామర్లను గుట్టుగా సంప్రదించి ఈ ఉపద్రవం నుంచి ఉమశమనం పొందుతున్నట్లుగా సాంకేతిక నిపుణులు అనుమానిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనుగొంటే బావుంటుంది. ఎందుకంటే…
ఇటువంటి సమస్యే 2038 జనవరి19న తెల్లవారుఝామున 3.14 గంటలకు రాబోతోంది…