వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు ఇందన శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన వేసవిలో విద్యుత్ డిమాండ్, మోటార్లకు మీటర్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యుత్ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకూడదని అధికారులను ఆదేశించారు. బొగ్గు నిల్వల విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవాలని, థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్ల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరు చేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశామని, మార్చినాటికి మరో 20 వేల కనెక్షన్లకు పైగా మంజూరు చేస్తామని, విద్యుత్ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.