లాక్ డౌన్ అనంతరం కీలకంగా మారనున్న గొడుగు!

-

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నది ఒక సామెత! ఈ కరోనా పుణ్యమాని భౌతిక దూరం కోసమా అని రకరకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయి! నిజంగా గొడుగు లేని ఇల్లు అంటూ ఉండకపోవచ్చు కదా. ధరల్లో తేడా ఉండొచ్చు కానీ… ధనిక పేదా తేడా లేకుండా అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది ఈ గొడుగు. ఎండల్లో వాడేటోళ్లు కాస్త తక్కువగా ఉన్నా… వర్షాకాలం వచ్చిందంటేఇంట్లో దాచిన గొడుగుల్ని బయటకు తీసేస్తుంటారు. వర్షం పడితేనే గొడుగులు తీస్తాం అనడానికి ఇంక వీలులేదు!

అవును… వర్షాలు పడ్డప్పుడే గొడుగు తీస్తాం అంటే ఇకపై కుదరకపోవచ్చు. ఇక ఎండా, వానా అన్న తేడా లేకుండా రానున్న రోజుల్లో అందరూ గొడుగులు తీయక తప్పని పరిస్థితి. కరోనా పుణ్యమా అని రానున్న రోజుల్లో గొడుగులకు డిమాండ్ పెరిగిపోనుంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత భౌతికదూరాన్ని పాటించటానికి గొడుగుకు మించిన సాధనం ఉండబోదు. అవునంటండి బాబు… ఈ గొడుగు గొప్పతనాన్ని గుర్తించిన తిరుప్పూర్ జిల్లా కలెక్టర్ విజయ్ కార్తికేయన్ తాజాగా ఆసక్తికర ఆదేశాల్ని జారీ చేశారు. అత్యవసర పనుల నిమిత్తం ఎవరైనా బయటకు రావాలనుకునే వారు గొడుగుల్ని తప్పనిసరిగా వాడాలని సూచించారు. గొడుకు.. గొడుగుకు మధ్యనున్న దూరంతో భౌతిక దూరం ఆటోమేటిక్ గా వచ్చేస్తుందన్నది ఆయన ఆలోచన.

మరికొన్ని రోజుల్లో పాక్షికంగా లాక్ డౌన్ ఎత్తేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటోళ్లు తప్పని సరిగా గొడుగు వాడాలన్న నియమం పెట్టే అవకాశం ఉందంటున్నారు. పెద్దగా ఖర్చు లేకుండా.. ప్రజలందరూ ఒకే పద్దతిని ఫాలో కావటానికి గొడుగుకు మించింది మరొకటి ఉండదంటున్నారు. సో… ఇంట్లో ఉన్న గొడుగుల్ని భద్రంగా చూసుకోండి.. దుమ్ము పట్టి ఉంటే దులిపి సిద్ధం చేసుకోండి. గొడుగా… మజాకా…!

Read more RELATED
Recommended to you

Latest news