ప్రపంచ వ్యాప్తంగా మనిషి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధించాడు. అంతరిక్షంలోకి వెళ్తున్నాడు. చంద్రునిపై కాలనీలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ.. ఎన్ని సాధించినా ఇప్పటికీ మనల్ని వేధిస్తున్న ప్రశ్న మాత్రం ఒక్కటే.. మానవజాతి అసలు భూమిపై ఎలా ఏర్పడింది..? మనిషి మొదట ఎప్పుడు భూమిపైకి వచ్చాడు..? ఈ ప్రశ్నలకు పేరుమోసిన పురాతత్వ శాస్త్రవేత్తలు, నిపుణులే సమాధానం చెప్పలేకపోయారు. కానీ.. మానవజాతి సుమారుగా 7 లక్షల ఏళ్ల కిందటే ఏర్పడిందని పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల ద్వారా వెల్లడైంది.
ఫిలిప్పీన్స్‌లో పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ స్థలంలో తవ్వకాలు జరపగా.. అక్కడ జింక, తాబేలు, బల్లి తదితర జీవాలకు చెందిన అస్థిపంజరాలు, ఖడ్గ మృగం అస్థికలు బయట పడ్డాయి. దీంతో సైంటిస్టులు ఆ శిలాజాలను 7 లక్షళ ఏళ్ల కిందటివని గుర్తించారు. ఇక అప్పట్లో హోమో ఎరెక్టస్ అనే మానవజాతికి చెందిన వారే జీవించారట. అందువల్ల వారే మన పూర్వీకులని సైంటిస్టులు అంటున్నారు. ఇక వారు ఆఫ్రికాలో మొదట నివాసం ఉండి తరువాత ఐరోపా, ఆసియాలకు వలస వెళ్లారట.
అయితే ఖండాలు దాటాలంటే ఇప్పట్లోలా అప్పుడు షిప్పులు, విమానాలు లేవు. మరి ఎలా దాటారు..? అంటే.. అప్పట్లో సముద్ర మట్టాలు చాలా తక్కువగా ఉండేవని.. పూర్తిగా మంచుయుగం కావడంతో సముద్రాలు గడ్డకట్టి ఉండేవని.. దీంతో వారు మైళ్లకు మైళ్లు కాలినడకన ప్రయాణం చేసి ఉంటారని సైంటిస్టులు అంటున్నారు. ఇక సునామీల వంటి ప్రకృతి విపత్తుల వల్ల ఒక ప్రదేశంలో ఉన్న వారు మరొక ప్రదేశానికి కొట్టుకు వచ్చి ఉంటారని అంటున్నారు. ఆఫ్రికాలో ఒకప్పుడు నివసించిన హోమో ఎరెక్టస్ జాతికి చెందిన మనుషులు ఉన్న కాలానికి చెందిన జంతు జీవాలు ఎక్కడో ఫిలిప్పీన్స్‌లో బయట పడడం నిజంగానే సైంటిస్టులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కేవలం ఈ ఒక్క ఆధారాన్ని బట్టి మానవజాతి ఆవిర్బావం, పరిణామ క్రమం గురించి చెప్పలేమని, అందుకు మరిన్ని ఆధారాలు కావాలని వారు అంటున్నారు.