బీజేపీ-జనసేన కూటమికి అమరావతి ఎఫెక్ట్ బాగానే తగిలింది. అమరావతి అంటే.. కేవలం గుంటూరు మాత్రమే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై మంచి ప్రభావం ఉన్న రాజధాని ప్రాంతంగా అందరూ భావించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు చెందిన నాయకులు, వ్యాపారవేత్తలు, ఓ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలు కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. అయితే, ఇప్పుడు అమరావతిని ఇక్కడ నుంచి తరలించడంతో ఆయా వర్గాలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైంది. శాసన రాజధానిగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు పెద్దగా జరిగే అవకావం లేనందున ప్రజల సాంధ్రత కూడా తక్కువగానే ఉంటుంది. కేవలం పేరుకే ఇది రాజధానిగా ఉంటుందని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే రాజధాని ఉద్యమానికి ఆయా వర్గాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి తెరచాటున ఉండి నడిపించాయనే భావన ఉంది. ప్రజల్లోనూ ఇదే తరహా భావన వ్యక్తమవుతోంది. ఇప్పుడీ పరిణామం.. రాజకీయంగా వివిధ పార్టీలపై ఉంటుంది. వాస్తవానికి ఇతర పార్టీలతో పోల్చుకుంటే.. జనసేన-బీజేపీకి ఈ మూడు జిల్లాల్లోనూ మరింత గట్టిగా దెబ్బతగలడం ఖాయమని అంటున్నారు. నిజానికి ఇప్పటికే ఈ మూడు జిల్లాల్లో ఈ రెండు పార్టీలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. నాయకులు కూడా లేకపోవడం గమనార్హం.
దీంతో ఈ మూడు జిల్లాల్లో రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల కూటమి ఎంత ప్రయత్నించినా.. కాంగ్రెస్ తరహా పరిస్థితి తథ్యమని అంచనాలు వేస్తున్నారు. అంటే..కేవలం ఖర్చు తప్ప ప్రజలు ఆమోదించే పరిస్థితి లేదు. మూడు రాజధానులను అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పడం లేదు. పోనీ.. నిన్నటి వరకు చెప్పిన అమరావతినే కొనసాగించే మాటను కూడా జనసేన-బీజేపీ కూటమి పక్కకు పెట్టింది. తమకు ఎవరూ ప్రశ్నించరాదని జనసేన అంటే.. మాకు సంబంధం లేదు.. ఏదైనా ఉంటే కేంద్ర బీజేపీని అడగాలని రాష్ట్ర కమలం పార్టీ నేతలు స్పష్టం చేసేశారు.
దీంతో మున్ముందు ఈమూడు జిల్లాల్లోనూ వ్యతిరేకత పెరిగి.. ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు మిత్రపక్షాలూ రాబోయే రోజుల్లో ఈమూడు జిల్లాలను పక్కన పెట్టి మిగిలిన 10 జిల్లాలపైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నట్టు విశ్లేషణలు వస్తున్నాయి. ఎలాగూ ఫలితం లేని జిల్లాల్లో పోరు చేయడం కన్నా.. వదులుకుని,సానుభూతి వచ్చే వరకు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.