ఆమె ఎంత కష్టమైనా సరే.. రోజూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు స్కూలుకు వెళ్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి నదిలో ఈదుతూ స్కూల్‌కు చేరుకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తోంది.
మనస్సుంటే.. మార్గముంటుంది.. అన్నారు పెద్దలు. ఎంత కష్టమైన పనైనా సరే.. ఆలోచిస్తే దాన్ని నిర్వర్తించేందుకు ఏదో ఒక మార్గం దొరుకుతుందని.. ఆ పదాల అర్థం. అవును.. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మింది కాబట్టే ఆమె.. ఎంత కష్టమైనా సరే.. రోజూ పిల్లలకు పాఠాలు చెప్పేందుకు స్కూలుకు వెళ్తోంది. ప్రాణాలను పణంగా పెట్టి నదిలో ఈదుతూ స్కూల్‌కు చేరుకుని విద్యార్థులకు విద్యాబోధన చేస్తోంది. ఇతర ఉపాధ్యాయులకు ఆమె ఆదర్శంగా నిలుస్తోంది.
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లా రాథియాపాలాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా బినోదిని సామల్‌కు 2008లో పోస్టింగ్ ఇచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో ఆమె టీచర్‌గా చేరింది. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జరిపాల్ గ్రామంలో నివాసం ఉంటూ ఆ స్కూల్‌లో ఆమె టీచర్‌గా పనిచేయడం ప్రారంభించింది. అయితే ఆమె తన ఇంటి నుంచి స్కూల్‌కు వెళ్లేందుకు మధ్యలో ఉన్న నదిని దాటాలి. బ్రిడ్జి లేకపోవడంతో ఆ నదిలో ఆమె ఈదుకుంటూ స్కూల్‌కు వెళ్తోంది. అనంతరం అక్కడ రోజంతా విద్యార్థులకు పాఠాలు బోధించాక సాయంత్రం మళ్లీ యథావిధిగా ఆ నదిలో ఈదుకుంటూ ఇంటికి వెళ్తోంది.
అయితే బినోదినికి అలా కష్టపడి పనిచేసినా ప్రస్తుతం ఆమెకు దక్కుతున్నది కేవలం రూ.7వేలే. నిజానికి 2016లోనే ఆమె ఉద్యోగం పర్మినెంట్ అయి ఉంటే ఆమెకు ఇప్పుడు రూ.27వేల వేతనం లభించేది. అయినప్పటికీ ఆ స్కూల్‌లో ఉన్న పిల్లల కోసం అంతలా కష్టపడుతోంది. అయినా.. తనకు దిగులు లేదని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దితే చాలని ఆమె అంటోంది. ఆమె చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ ఆమెకు శాల్యూట్ చేయాల్సిందే..!