భారత్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే వాళ్లు కరోనా బారిన పడితే వాళ్ల ప్రాణాలకే అపాయం కలుగుతోంది. తాజాగా లండన్ పరిశోధకులు చేసిన పరిశోధనల్లో ఈ వైరస్ కు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. లండన్ పరిశోధకులు కొన్ని రకాల క్యాన్సర్లతో బాధ పడే వాళ్లకు కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది.
ఎముక మజ్జ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ల్యుకేమియా క్యాన్సర్ బారిన పడ్డవాళ్లకు వైరస్ సోకే అవకాశం ఎక్కువని వీళ్లు వైరస్ బారిన పడినా త్వరగా కోలుకోలేరని తెలిపింది. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 1,044 మంది క్యాన్సర్ రోగులపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. ఈ సంవత్సరం మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 8వ తేదీ వరకు ఈ అధ్యయనం జరిగిందని సమాచారం.
ఈ అధ్యయనం జరుగుతున్న సమయంలో 319 మంది రోగులు మరణించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. లానెట్ జర్నల్ లో ఈ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న రాచెల్ కెర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అధ్యయన ఫలితలు కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించడంలో సహాయపడతాయని చెప్పారు. ఈ ఫలితాల ద్వారా రిస్క్ అసెస్ మెంట్ టూల్ ను తయారు చేస్తామని పేర్కొన్నారు.