మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వైన్ షాపులను ఏర్పాటు చేసేందుకు చాలా వరకు దరఖాస్తులను స్వీకరించి లాటరీ తీసి అందులో పేర్లు వచ్చిన వారికి వైన్ షాపులను కేటాయిస్తున్నారు. గతంలో వేలంపాట ద్వారా షాపులను కేటాయించేవారు. అయితే అలా చేయడం వల్ల మద్యం వ్యాపారులు సిండికేట్ అయ్యి మద్యాన్ని ఎంఆర్‌పీకి కాకుండా ఇంకా ఎక్కువ ధరలకు విక్రయించడం మొదలు పెట్టారు. దీంతో వేలం విధానాన్ని రద్దు చేసి లాటరీ విధానంలో షాపులను కేటాయిస్తున్నారు.
అయితే రాజస్థాన్‌లో వసుంధర రాజే సీఎంగా ఉన్నప్పుడు లాటరీ విధానమే ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం అశోక్ గెహ్లాట్ లాటరీ విధానాన్ని రద్దు చేసి వేలం విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో అక్కడ వైన్ షాపులను వేలం ద్వారా మాత్రమే కేటాయిస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆ వేలాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఆ రాష్ట్రంలోని హనుమాన్ గఢ్ జిల్లాలో ఉన్న నోహర్ అనే ప్రాంతంలోని ఓ వైన్ షాపుకు వేలంలో భారీ ధర వచ్చింది. దాని కనీస ధరను ముందుగా రూ.72 లక్షలుగా నిర్ణయించారు. అయితే వేలం ఉదయం 11 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 2 గంటల వరకు కొనసాగింది. దీంతో చాలా మంది పోటీలు పడి మరీ ఆ షాప్ కోసం వేలం పాడారు. చివరకు దానికి వేలంలో రూ.510 కోట్ల ధర వచ్చింది.
అదే ప్రాంతానికి చెందిన కిరణ్ కన్వార్ అనే వ్యక్తి రూ.510 కోట్లకు ఆ షాప్‌ను వేలంలో దక్కించుకున్నాడు. అయితే గతంలో లాటరీ విధానం వల్ల ఆ షాప్‌కు రూ.65 లక్షలే వచ్చాయి. కానీ ఆ షాప్‌కు అంతటి భారీ ధర వస్తుందని అధికారులు కూడా ఊహించలేదు. దీంతో అంతటి ధర వచ్చే సరికి అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఆ రాష్ట్రంలో మొత్తం 7వేల షాప్‌లకు ఇలాగే వేలం నిర్వహిస్తున్నారు.