ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (corona virus) వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అనేక దేశాల్లో ప్రజలు కోవిడ్ సంక్షోభం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మరో షాకింగ్ విషయం తెలిసింది. సౌతాఫ్రికాకు చెందిన 36 ఏళ్ల ఓ హెచ్ఐవీ పాజిటివ్ మహిళ ఏకంగా 216 రోజుల పాటు కోవిడ్‌తో బాధపడింది.
సాధారణంగా కోవిడ్ సోకితే 14 రోజుల ఇంకుబేషన్ సమయం కనుక ఆలోగా నయం అవుతుంది. కొందరికి కోలుకునేందుకు ఇంకొన్ని ఎక్కువ రోజుల సమయం పడుతుంది. ఆలోగా కోలుకుంటే సరేసరి, లేదంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మరణిస్తారు. కానీ ఆ మహిళలో మాత్రం కరోనా వైరస్ 216 రోజుల పాటు ఉంది. అలాగే అది 32 సార్లు ఉత్పరివర్తనం (మ్యుటేషన్) అయ్యింది. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనం ద్వారా వెల్లడించారు.
కాగా ఆ మహిళకు సోకిన కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ కూడా 13 సార్లు మ్యుటేషన్ అయ్యింది. అయితే ఆ మహిళలో మ్యుటేషన్‌కు గురైన వైరస్ ఇతరులకు సోకిందా లేదా అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. ఈ క్రమంలోనే ఈ విషయంపై సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల తాలూకు వివరాలను మెడ్ఆర్ఎక్స్ఐవీ అనే జర్నల్‌లో ప్రచురించారు.
ఆ మహిళకు హెచ్ఐవీ ఉంది కనుకే వైరస్ అలా 32 సార్లు మ్యుటేషన్ అయి ఉంటుందని అధ్యయన రచయిత టులియో డి ఒలివియెరా వెల్లడించారు. కరోనా వైరస్ కొందరు రోగుల్లో చాలా రోజుల వరకు ఉంటుంది, దీంతో అది మ్యుటేట్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అయితే హెచ్ఐవీ సోకిన అందరిలోనూ వైరస్ ఇలాగే ఉత్పరివర్తనం చెందుతుందా, లేదా అన్నది పరిశోధించాల్సి ఉందని తెలిపారు.