జైళ్లలో మానవ హక్కుల ఉల్లంఘన ఇప్పటికీ జరగడం ఆందోళనకరమైన విషయమని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పోలీసులు, నిందితులతో సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. జాతీయ న్యాయ సేవ కేంద్రం మొబైల్ యాప్ ప్రారంభించిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ ఉన్న వ్యక్తులపై కూడా పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించినట్లు న్యాయస్థానాల దృష్టికి వచ్చిందని, మానవహక్కుల ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా పోలీసులకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రాజ్యాంగపరమైన ఒడంబడికలు, హామీలు ఉన్నప్పటికీ పోలీసు ఠాణాల్లో క్రియాశీలకమైన న్యాయసహాయం లేకపోవడం అన్నది.. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారితో పాటు.. అరెస్టైన వారికి రక్షణపరమైన నష్టాన్ని మిగిల్చేదే అన్నారు.
రక్షణ ఉన్న వ్యక్తులకు, న్యాయపరిజ్ఞానం లేనివారికి న్యాయం అందే విధానంలో ఉన్న తేడాను తొలగించడం అత్యవసరమని జస్టిస్ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ పౌరుల కోసమే ఉందన్న విశ్వాసం కల్పించాలన్నారు. న్యాయపరిజ్ఞానం లేని ఎంతో మంది ఏళ్లుగా న్యాయవ్యవస్థకు వెలుపలే ఉండిపోతున్నారని జస్టిస్ రమణ అన్నారు. నల్సా యాప్ పేదలకు, న్యాయ సాయం అవసరమైన వారికి పరిహారం కోసం బాధితులు చేసే పోరాటంలో అండగా ఉంటుందని జస్టిస్ చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాలం లేక న్యాయసహాయానికి అవరోధాలు ఏర్పడుతున్నాయన్న జస్టిస్ రమణ అంతర్జాల అనుసంధానం మెరుగుపరచాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా దేశంలో ఏ మూల నుంచైనా క్షణాల్లో న్యాయ సహాయం పొందవచ్చని జస్టిస్ రమణ పేర్కొన్నారు. న్యాయ సహాయం, సేవల కోసం.. ప్రత్యేకంగా తీసుకొచ్చిన యాప్‌ను జస్టిస్ రమణ.. సహ న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కలిసి ఆవిష్కరించారు.