తెలంగాణ రాష్ట్రంలో పెద్దపులుల సంచారం టెన్షన్ పెడుతున్నది. బెబ్బులి దాడులతో ప్రజలు బెంబేలెత్తున్నారు.. అటవీ గ్రామాల ప్రజలు ఇళ్లు విడిచి బయటికి రావడానికి జంకుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి ఇప్పటికే ఇద్దరిని హత మార్చింది. మొన్న విఘ్నేష్ ఘటన మరువక ముందే, నిన్న పెంచికల్పేట మండలం కొండపల్లి గ్రామంలో నిర్మల(15) బాలికపై దాడి చేసి చంపేసింది. ఆదివారం ఉదయం తోటి కూలీలతో కలిసి బాలిక గ్రామానికి సమీపంలో ఉన్న చేనులోకి పత్తి ఏరడానికి వెళ్లింది. పత్తి ఏరుతుండగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పెద్దపులి కనిపించడంతో కూలీలు పరుగులు తీశారు. అక్కడే ఉన్ననిర్మలపై పెద్దపులి దాడి చేయడంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పక్షం రోజుల వ్యవధిలోనే ఇద్దరిపై దాడి చేసి చంపేయడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిర్మల అంత్యక్రియలను ఇవ్వాల పూర్తి చేశారు. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా, అంబులెన్స్కు పెద్ద పులి ఎదురు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. నిర్మల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని తెలిపారు. ఇప్పటికే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
ఇక పెద్దపులి సంచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ మండలం కొత్తగూడ మండలంలో గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసరాల్లో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాని పాదముద్రలను అధికారులు గుర్తించారు. గుంజేడు ముసలమ్మ ఆలయానికి వచ్చే ప్రజలు అమ్మవారికి కోళ్లు, గొర్రెలను బలి ఇస్తుంటారు. అయితే, ఆ రక్తవాసనకు రుచి మరిగిన పులి ఆలయ పరిసరాల్లో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అటు వైపు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇటీవల గార్ల మండలంలో ఇటీవల ఓ ఆవుపై కూడా దాడి చేసింది. మొత్తంగా అటవీ గ్రామాల ప్రజలను పెద్దపులులు భయపెడుతున్నాయి.