పుష్కరకాలంనాటి కలను సాకారం చేసుకునేందకు ఓ పార్టీ ఉత్సహంగా ఉంటే… మరోపార్టీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. మరికొన్ని పార్టీలు అసలు బరిలో దిగుదామా వద్దా అనే ఆలోచనలో ఉన్నాయట. అధికార పార్టీలో సంతోషం తీసుకొచ్చిన స్థానిక ఎన్నికలు.. విపక్షపార్టీల్లో ఆనందాన్ని ఎందుకు ఆవిరి చేశాయట..పన్నెండేళ్లుగా అధికారుల ఏలుబడిలో ఉన్న తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది.
కందాటి శంకర్‌రెడ్డి చైర్మన్‌గా 2006లో చివరిగా తిరుపతి మున్సిపాలిటీ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. 2009లో కార్పొరేషన్ హోదా లభించింది. అయినా ఎన్నికలకు నోచుకోలేదు. గత ముఖ్యమంత్రులెవ్వరూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేదు. కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. తన కుమారుడు అభినయ్‌రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మోజారిటీయే రావడంతో అధిష్ఠానం దగ్గర భూమనకు పెద్దగా మార్కులు పడలేదు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో అభినయ్‌రెడ్డిని బరిలో దింపి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు.
అభినయ్‌రెడ్డి స్వయంగా నాలుగో డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నిక ద్వారా కుమారుడితో ఎన్నికల అరంగేట్రం చేయిస్తున్నారాయన. ఇక చైర్‌పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో వారి ఎంపిక కూడా భూమనే చూస్తున్నారట. డాక్టర్ శిరీష, బీసీ నేత అన్న రామమంద్ర కుమార్తె పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కొద్దిలో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న టీడీపీ.. ఇంకా ఆ ఓటమి భారం నుంచి బయటపడినట్లు లేదు. కార్పొరేషన్ ఎన్నికలపై నేతలు ఆసక్తి చూపించడం లేదట. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా.. గ్రూపు రాజకీయాలు భరించలేక ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారట.
టీడీపీ పరిస్థితి అలా ఉంటే.. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల దుస్థితి మరీ దారుణంగా తయారైందట. తిరుపతిలో జనసేనకు బలమైన బలిజ సామాజికవర్గం అండగా ఉన్నా.. వారిని నడిపించే వారు లేక ఇబ్బంది పడుతున్నారట. ఇక బీజేపీతో పొత్తు కుదరడంతో.. సీట్ల కేటాయింపులో అప్పుడే రెండు పార్టీల మధ్యా పేచీ మొదలైందట. కొన్ని డివిజన్ల విషయంలో మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబడుతున్నారట.