తెలంగాణ రాష్ట్రంలో బదిలీల కోసం ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. రెండోరోజు ట్రాన్స్ఫర్ ల కోసం 32 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి వరకు 40,882 దరఖాస్తులు అందాయి. నేటితో అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది.
ఆన్లైన్ లో అప్లై చేసుకున్న వారు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు హార్డ్ కాపీలు అందజేయాల్సి ఉంటుంది. కాగా, ఆన్లైన్ పద్ధతిలో లోపాలు, అప్ గ్రేడ్ కానీ ఆప్షన్లు, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు, ఇలా ఉపాధ్యాయుల బదిలీల్లో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా దరఖాస్తు చేసుకునే గడువును పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ యోచిస్తోంది.
ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉంది. గడువు పొడిగింపు విషయాన్ని సోమవారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. టీచర్ల బదిలీలు, పదోన్నతికి సంబంధించిన షెడ్యూల్ ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 నుంచి టీచర్లు బదిలీలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు.